సరిగ్గా ఆరేళ్లే నడిచింది ఆ పత్రిక. రాజకీయ నేతల గుండెల్లో వణుకు పుట్టించింది. అవినీతి నేతలకు ఆరేళ్ళు కంటికి కునుకు లేకుండా చేసింది. అదే “ఎన్ కౌంటర్”! ఇప్పుడు ఆ పత్రిక లేదు కానీ, తలచుకుంటే సునామీయే. ఆ పత్రిక కు అన్నీ ఒకే ఒక్కడు… అతనే పింగళి దశరథరామ్. చిన్న వయసులోనే తన 29వ ఏట చంపేశారు. దశరధరామ్ 38వ వర్ధంతి ఇవాళ. కలం యోధుడ్ని కొంచెం గుర్తు చేసుకుందాం.
భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారి చిన్న కుమారుడు చలపతిరావు కుమారుడే దశరథరామ్. అతను చదివింది తొమ్మిదో తరగతి మాత్రమే.ఇందిరమ్మ విధించిన ఎమర్జన్సీ కి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమం పట్ల ఆకర్షితుడై జనసంఘర్ష్ సమితి ప్రారంభించాడు. మీసా చట్టం కింద అరెస్ట్ అయి జైలుకెళ్లాడు. అప్పుడతని వయసు కేవలం పద్దెనిమిది. అదే అతని టర్నింగ్ పాయింట్. జైల్లో మహా మహులను కలిశాడు.అవే అతనికి జీవిత పాఠాలు.విడుదల అయ్యాక హోటల్ లో కొంత కాలం సర్వర్ గా మారాడు. 1972లో వినుకొండ నాగరాజు గారి కమెండో పత్రిక లో చేరాడు! కొన్నాళ్ళు ‘రేపు’ నరసింహారావు గారి పత్రికలో పని చేశాడు. 1979లో సునామీ లా ఎన్ కౌంటర్ పత్రిక ప్రారంభించాడు. ప్రారంభం లోనే దడ పుట్టించాడు. నిప్పులు చెరిగాడు. ఎర్రటి సూర్యుడిలా రాతలతో రగిలిపోయాడు.
అప్పటి కాంగ్రెస్ నాయకులను తూర్పార పట్టాడు! 1983లో వచ్చిన ఎన్టీఆర్ ను కూడా వదల్లేదు! అది పత్రిక భాష కాదు! ఇడియట్, లుచ్చా, దొంగ, బద్మాష్, మెంటల్ ఇలా ఘాటుగా ఉండేవి ఆయన రాతలు! కొత్త కొత్త విషయాలు, అబ్బురపోయే సంచలనాలు! ముఖ్యంగా ఆయన ఆయా ఐటమ్స్ కు పెట్టే హెడ్డింగులు ఇప్పటికీ చాలా మంది నోట్లో నానుతుంటాయి! సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి! జోకుడు వ్యవహారం ఉండదు! మొహమాటం, బెదురు అదురు అసలు ఉండవు! చదువుతున్న వారికి కూడా చెమటలు పట్టేస్తాయి! వీడెవడ్రా బాబు అనిపిస్తాయి! వీడ్ని ఎవరో ఒకరు వేసేస్తారు అని చదివిన ప్రతి ఒక్కడూ అనుకునేవారు!
1981లో తన మిత్రుడు రమణ చెల్లెలు మామిడాల సుశీల గారిని ఆదర్శ వివాహం చేసుకున్నాడు దశరథరామ్! పదిరి కుప్పం, కారంచేడు ఘటనలు ధైర్యంగా కళ్లకు కట్టేలా ప్రచురించాడు! ఆయన పై వరస దాడులు మొదలయ్యాయి. చాలా సార్లు తప్పించుకున్నాడు. అది అక్టోబర్ 20, 1985 అర్ధరాత్రి! సుశీలతో కలసి ప్రతిఘటన సినిమాకు వెళ్లి రిక్షా లో తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా గిరి రోడ్డు లో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు..
కత్తులతో పొడిచేసారు. రిక్షా వాడు నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. చంపిన వారెవరో కాదు… ఆయన దగ్గర పని చేసిన తోట రాముడే. అతనికి పెళ్ళి చేసి ప్రోత్సహించింది దశరధరామ్. అయినా అతడు చంపేశాడు. తోట రాము పొలిటికల్ ఎన్ కౌంటర్ పత్రిక ఎడిటర్. దాడి లో పాల్గొన్న మరొకరు వెల్లంకి కృష్ణమోహన్ ని ఎవరు చంపించింది. నేను ఇప్పుడు గుర్తు చేయనక్కరలేదు! సరైన సమయం లో పోలీసులు ఆసుపత్రి లో చేర్చి ఉంటే బతికి ఉండేవారు అని భార్య సుశీల గారు అంటుండే వారు! ఇవాల్టికి దశరధ్ హత్య జరిగి 38 ఏళ్ళు! 29 ఏళ్లకే కలంయోధుడి కి నూరేళ్లు నిండిపోయాయి! నివాళులు.
-డా. మహ్మద్ రఫీ (సీనియర్ జర్నలిస్ట్)