Owaisi Chandrashekhar Azad Alliance

కొత్త కూటమి
ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ముందుకు కీలక పరిణామం చోటుచేసుకుంది. 2027లో జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈక్రమంలోనే యూపీలో కొత్త కూటమి తెరపైకి వచ్చింది. 2027లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం, ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి సంయుక్తంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. లక్నోలో ఇరుపార్టీలకు సంబంధించిన నేతలు సమావేశం అయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(Owaisi Chandrashekhar Azad Alliance) .. వారి అలయన్స్‌పై అధికారిక ప్రకటన చేశారు.

ఇండియా కూటమికి దూరం
అంతేకాదు తమ కూటమికి ‘సామాజిక్ పరివర్తన్ మోర్చా’ అని పేరు పెట్టారు. కొత్త కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రశేఖర్ ఆజాద్(Owaisi Chandrashekhar Azad Alliance) పేరును ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. ఉత్తరప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ కూటమి అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బీజేపీని గెలవకుండా చేయడమే తమ ముందు ఏకైక లక్ష్యమని చెప్పారు. యోగి ప్రభుత్వాన్ని మూడోసారి రాకుండా అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటూ దళితులు, ముస్లింలు, ఇతర వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తాము పనిచేస్తామని చెప్పారు.

ఎన్నికల హామీలు
ఇక ఎన్నికల హామీలను సైతం ప్రకటించింది సామాజిక్‌ పరివర్తన్‌ మోర్చా కూటమి. తాము అధికారంలోకి వచ్చాక ఇంటర్‌మీడియట్‌ వరకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం, యువతకు ఉపాధి కల్పిస్తామని కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్ (Owaisi Chandrashekhar Azad Alliance) స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో విభేదాలు రాకుండా చూసుకుంటామన్నారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుకాకే ఆకూటమిలో చేరలేదని ఒవైసీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో భావసారూప్యత కలిగిన ఇతర పార్టీలను కూడా తమ మోర్చాలోకి ఆహ్వానిస్తామని చెప్పారు.

ఎవరి బలం ఎంత..!
తెలంగాణలో AIMIMకు బలమైన రాజకీయ పునాది ఉంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం ఇప్పటివరకు పార్టీకి పరిమితమైన ఎన్నికల ప్రభావమే ఉంది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో AIMIM 95 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 0.49 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఇక ఆజాద్‌కు ప్రధాన రాజకీయ బలం దళిత సామాజిక వర్గాల్లో, ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈయన కూడా 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో పోటీ చేశారు. ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆ ఎన్నికల్లో ఆజాద్ సమాజ్ పార్టీకి సుమారు 0.13 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగినా స్థానం నుంచి విజయం సాధించిన ఆజాద్ (Owaisi Chandrashekhar Azad Alliance)పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఒవైసీతో పోలిస్తే ఆజాద్‌కు యూపీలో దళిత యువతను సమీకరించే అవకాశం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు సుమారు 19 శాతం ఉన్నారు. వీరిలో కొంతమందికి ఒవైసీ ప్రభావం ఉన్నప్పటికీ, సమాజ్‌వాదీ పార్టీకి కూడా బలమైన మద్దతు ఇస్తారు. ముస్లిం, దళిత ఓట్లలో కొంత భాగం కొత్త కూటమి వైపు వెళ్తే సమాజ్‌వాదీ పార్టీ ఓట్ల సమీకరణంపై ప్రభావం ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష ఓట్లు చీలే పరిస్థితి ఏర్పడితే కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ఎన్నికల పరంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే చర్చ ఉంది. బీజేపీ టార్గెట్‌గా తెరపైకి వచ్చిన కొత్త కూటమి ఎలాంటి ఫలితాలు సాధిస్తోందో చూడాలి.