HomeNewsబీజేపీ మేనిఫెస్టో…కీలక హామీలు ఏంటో తెలుసా?

బీజేపీ మేనిఫెస్టో…కీలక హామీలు ఏంటో తెలుసా?

Published on

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి జోరుగా ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం ఇంకా తమ ఎన్నికల ప్రణాళికను విడుదల చేయలేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మించి బీజేపీ మేనిఫెస్టోలో ఏమేం ఉండబోతున్నాయి.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేంత స్టఫ్ ఏముంటుంది అనే ఆసక్తి నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా టూర్‌ కూడా దాదాపుగా ఖరారైంది. నవంబర్ 18న తెలంగాణలో పర్యటిస్తారు అమిత్ షా. ఒకే రోజు నాలుగు సభలకు ప్లాన్ చేసింది తెలంగాణ బీజేపీ. నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో అమిత్‌ షా పబ్లిక్ మీటింగ్స్‌కి ఏర్పాట్లు మొదలయ్యాయి.

అదే రోజు బీజేపీ తెలంగాణ మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నది కమలనాథుల ప్లాన్ అంటున్నారు. తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో బీసీ సాధికారిత, నగరాల పేర్ల మార్పు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, బీమా క‌వ‌రేజీ వంటి హామీలు ఉండ‌నున్నాయ‌ని స‌మాచారం. ఓటర్లకు ఉచిత విద్య, ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికీ జీవిత బీమా, రైతుల నుంచి క్వింటాలుకు రూ.3100 చొప్పున ధాన్యం కొనుగోలు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.20 వేలు, ప్ర‌తి మ‌హిళ‌కు ఏడాదికి 12 వేల రూపాయ‌ల సాయం, రూ.500 సిలిండ‌ర్ అందించ‌డం వంటి హామీలు ఇవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. అలాగే, తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా జాన‌ ఔషధి కేంద్రాలు, యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ పరీక్షలకు జాబ్ క్యాలెండర్, మతపరమైన పర్యాటకాన్ని పెంచుతామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొనే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐఐటీ, ఎయిమ్స్ త‌ర‌హాలో విద్యాసంస్థల స్థాపన , ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు క‌ట్టివ్వ‌డం వంటివి కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. దీంతో పాటు రజకులు, నాయీబ్రాహ్మణులు, వడ్రంగులు, విశ్వబ్రాహ్మణులు, చేతివృత్తులవారు, చిరు వ్యాపారులకు కోసం ప్రత్యేక పథకం, ఫీజుల నియంత్రణకు చర్యలు, మహిళా సంఘాలు, రైతులకు వడ్డీలేని రుణాలు అందించ‌డం వంటివి కూడా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోలో ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని తెలుస్తోంది. ఈనెల 28తో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో మోడీ ద్వారా బీజేపీ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలని భావిస్తోంది.

Latest articles

More like this