జాబిల్లిపై దిగిన ల్యాండర్, రోవర్ తమ పని కానిచ్చేస్తున్నాయి. బుధవారం ఉదయం 7.30 గంటలకు రోవర్.. ల్యాండర్ చిత్రాలను తీసి పంపించింది. ఈ చిత్రాలను భారత అంతరిక్ష సంస్థ సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేసింది. ‘స్మైల్ ప్లీజ్’ అంటూ సరదాగా రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘ఈ రోజు ఉదయం విక్రమ్ ల్యాండర్‌ను రోవర్ క్లిక్‌మనిపించింది. రోవర్‌కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి’ అని ఇస్రో ఆ పోస్టులో పేర్కొంది. అలాగే నావిగేషన్ కెమెరాలను ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ (LEOS) అభివృద్ధి చేసినట్లు తెలిపింది. 140 కోట్ల మంది ఆకాంక్షలను నెరవేరుస్తూ ఆగస్టు 23న చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ సురక్షితంగా దిగిన కొద్దిగంటల తర్వాత రోవర్ బయటకు వచ్చింది. చంద్రుడికి సంబంధించిన తాజా సమాచారం రోవర్ సహాయంతో ల్యాండర్ ద్వారా ఇస్రోకు చేరుతోంది. 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలాన్ని ప్రజ్ఞాన్ పరిశోధించనుంది. అక్కడి చిత్రాలను కూడా పంపుతోంది. ఈ చిత్రాలను ఇస్రో ఎప్పటికప్పుడు దేశప్రజలకు ట్విట్ ల రూపంలో అందచేస్తోంది.