HomeNewsAndhra Pradeshజనసేనకు గుడ్ న్యూస్.. గ్లాస్ గుర్తు కేటాయింపు

జనసేనకు గుడ్ న్యూస్.. గ్లాస్ గుర్తు కేటాయింపు

Published on

ఎన్నికల సంఘం జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. “జనసేన పార్టీకి ఎన్నికల గుర్తుగా మరోసారి గ్లాస్‌ను కేటాయించినందుకు ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు జరిగిన గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన అభ్యర్థులు గ్లాస్‌ గుర్తుపైనే పోటీ చేసిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 137 స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్‌ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు నాడు పోటీలో నిలిచారు.

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో ప్రజలకు సేవ చేయడానికి జనసేన అభ్యర్థులు సన్నద్ధమైన తరుణంలో రిజిస్టర్డ్‌ పార్టీ అయిన జనసేనకు గ్లాస్‌ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరుపేరునా నా తరఫున, జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను..” అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

మే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును తొలగించింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ప్రకటించిన సందర్భంలో జనసేన గ్లాస్ గుర్తును కోల్పోయింది. అప్పుడు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసింది. గాజు గ్లాసుకు జనాల్లో మంచి క్రేజ్ ఉంది. గాజు గ్లాసు చూస్తే.. జనసేన పార్టీ గుర్తుకు వచ్చేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. అయితే ఎన్నికల సంఘం తొలగించిన తరువాత జనసైనికులు నిరాశ చెందారు. తాజాగా మళ్లీ అదే గుర్తును తమ పార్టీకి కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో తాజా నిర్ణయం పార్టీకి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. జనసేన 25 నుంచి 30 స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు 3 ఎంపీ స్థానాల్లోనూ పోటీచేసే అవకాశం ఉంది. నర్సాపురం, మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాలకు జనసేన అభ్యర్ధులు పోటీచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. గ్లాసు గుర్తు ఎందుకు సైకిల్ గుర్తే తీసుకుంటే సరిపోతుంది కదా అని ట్వీట్ చేశారు. దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు.

Latest articles

More like this