HomeNewsనిరుద్యోగుల ఆశలు అడియాశలేనా?

నిరుద్యోగుల ఆశలు అడియాశలేనా?

Published on

తెలంగాణలో నిరుద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. గతంలో పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పరీక్షల లీకేజీ, వాయిదాలు, రద్దు అంటూ వారి జీవితాలతో ఆడుకుంటోందని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. పారదర్శకత అంటే నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవడమా? అంగట్లో సరుకులా ప్రశ్నాపత్రాలు అమ్ముకోవడమా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఎప్పుడూ నిరాశే ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కారణంగా డీఎస్సీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కూడా వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్​ లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. పదేళ్ళలో నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ చేసిందేం లేదంటున్నారు విద్యార్థి సంఘ నేతలు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే ఏ ఆకాంక్షలు నెరవేరలేదంటున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యానికి తగిన విధంగా బుద్ధి చెబుతామంటున్నారు.

తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికీ అరకొర మాత్రమే ఉద్యోగ నియామకాలు జరిగాయి. కొన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసుల వలన నియామకాలు లేట్ అవుతున్నాయి. ఇటీవల టీఎస్‌పీఎస్సీలో పనిచేసే కొందరి వ్యక్తుల వలన కొన్ని పేపర్లు లీక్‌ కావడంతో పరీక్షలు రద్దయ్యాయి. ఇలా ఉద్యోగ నియామకాలు వివిధ కారణాల వలన లేటవుతుండటంతో సగటు నిరుద్యోగి వేదన అంతా ఇంతా కాదు. తొలిసారి పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు తెచ్చుకొని పట్నం వచ్చి అర్థాకలితో, నిద్రలేమితో కష్టపడి చదువుకుంటున్న వారికి TSPSC పేపర్ల లీక్ పిడుగుపాటులా తగిలింది.ఇటీవల రద్దయిన గ్రూప్-1 పరీక్ష రెండవసారి నిర్వహించగా, ఆ సమయంలో కోటీ రూపాయల డబ్బు ఆదా చేద్దామని బయోమెట్రిక్ నిర్వహించలేదు. దీంతో పరీక్షల్లో పలు అవకతవకలు జరిగాయంటూ, తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల కన్నా, ఎక్కువ ఓఎంఆర్‌లు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా రెండవసారి పరీక్షను రద్దు చేసింది కోర్టు. గ్రూప్-2 సైతం ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా పడింది. మొదటిసారి సిలబస్ పెరిగిందనే కారణంతో ఉద్యోగార్థులు ఆందోళన చేయడంతో పరీక్షను వాయిదా వేసింది. మొన్న ఈ మధ్య ఎన్నికల కోడ్‌ని దృష్టిలో ఉంచుకొని రెండవసారి కూడా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడంతో ఉద్యోగాలకు మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పడం లేదు. దీంతో వారిపై ఇంకా ఆర్థిక భారం పడుతుంది. కోట్లాది కలలతో ఎన్నో ఆశలతో పుస్తకాలు చేతబట్టినటువంటి ఏ నిరుద్యోగిని కదిలించినా వారి కంట కన్నీళ్ళే.

Latest articles

More like this