HomeNewsటమోటా ధర తగ్గించమ్మా… అమ్మవారికి టమోటా మాల

టమోటా ధర తగ్గించమ్మా… అమ్మవారికి టమోటా మాల

Published on

అసలే టమోటాల ధర ఆకాశాన్నంటింది. టమోటా రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ఓ వ్యాపారి బాడీగార్డులను పెట్టగా… ఇప్పుడు మరో రైతు చేసిన పని హాట్ టాపిక్ అవుతోంది. కర్నాటకలో రైతు సోదరులు టమోటా పంట రక్షణకు సీసీ టీవీల నిఘా పెట్టడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. తోటలోకి ఎవరు వస్తున్నారు… కూలీలు ఏం చేస్తున్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు టమోటా తోటలోకి వస్తున్నారా అనేది సీసీ టీవీల ద్వారా పరిశీలిస్తున్నారు.

ఇంత చేసినా ఏకంగా టమోటా పొలంలోకి వెళ్లి 1000 కిలోల టమోటాలను చోరీ చేశారు ఘరానా దొంగలు. ఎంతైనా టమోటా అంటే బంగారం కంటే కాస్ట్ లీ మరి. టమోటా కనిపిస్తే దాన్ని దొంగతనం చేయకుండా వదిలేలా లేరు దొంగలు. టమోటాలు ఉన్నవాళ్లు జర జాగ్రత్త. మీ ఇంట్లో టమోటాలు ఉంటే ఫ్రిజ్‌లో కాదు బీరువాలో పెట్టి తాళం వేయండి. ఇక టమోటా దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగే పరిస్థితి వచ్చేలా ఉంది.

కర్నాటకలోని గోణి సోమనహళ్లిలో ధరణి అనే రైతు తనకున్న భూమిలో టమోటా పంట వేశాడు. అనుకున్నదాని కంటే పంట బాగా పండింది. వారం రోజుల్లో మార్కెట్‌కు తరలించాలని భావించాడు. కానీ ఈ లోగానే దొంగలు పంటనంతా లూటీ చేశారు. రూ. 1.50 లక్షల విలువ చేసే టమోటాలు ఎత్తుకెళ్లారు.ఆ రైతు ఉదయం పొలానికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాకయ్యాడు. అసలేం జరిగిందంటే.. చెట్లకు టమోటాల్లేవ్‌. చేతికొచ్చిన పంటను దొంగలు ఎత్తుకెళ్లారంటూ గుండెలు బాదుకున్నాడు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చాడు.

అంతేకాదు చెన్నైలో కొందరు భక్తులు చేసిన పని దేశమంతా వైరల్ అవుతోంది. అమ్మవారికి 508 టమోటాలతో మాల వేశారు. టమోటా ధరలు తగ్గాలంటూ అమ్మవారికి పూజలు చేశారు. అంతేకాదు కాస్త ఖరీదైనా టమోటా మాలవేసి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తమిళనాడులోని నాగపట్టినం జిల్లా కురుకుడిలో ప్రసిద్ధి చెందిన మహా మారియమ్మన్‌, నాగమ్మన్‌ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఆడి నెల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సంతాన భాగ్యం, విద్య, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగాలని, తమ సమస్యలు తీరాలని కోరుకుంటూ భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో, ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన టమోటా ధరలు తగ్గించాలని కోరుతూ కొందరు భక్తులు అమ్మవారికి 508 టమోటాలతో చేసిన మాల ధరింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏది ఏమైనా ఇప్పుడు టమోటా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

Latest articles

More like this