HomeNewsకాంగ్రెస్ గెలుపు ఎఫెక్ట్.. పలువురు ఓఎస్డీలు, కార్పోరేషన్ ఛైర్మన్ల రాజీనామాలు

కాంగ్రెస్ గెలుపు ఎఫెక్ట్.. పలువురు ఓఎస్డీలు, కార్పోరేషన్ ఛైర్మన్ల రాజీనామాలు

Published on

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 64 సీట్లు సాధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు ఓఎస్‌డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్‌రావు రాజీనామా చేశారు. ఇంటెలిజెన్స్‌ ఐజీగా పదవీ విరమణ పొందిన ఆయన్ని.. ఆ తర్వాత గత ప్రభుత్వం మూడేళ్లపాటు ఓఎస్‌డీగా బాధ్యతలు అప్పగించింది. తాజాగా మారిన సమీకరణాల దృష్ట్యా ప్రభాకర్‌రావు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల ఫోన్లను ప్రభాకర్‌రావు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ఆరోపించారు. అలాగే టాస్క్‌ఫోర్స్ ఓఎస్‌డీ రాధాకిషన్ రావు రాజీనామా చేశారు. మూడేళ్ల క్రితం పదవి విరమణ చేసిన ఆయన.. ఆ తర్వాత ఓఎస్డీగా నియమితులయ్యారు. గత నెలలో ఓఎస్డీ బాధ్యతల నుంచి ఆయన్ని ఈసీ తప్పించింది. తాజాగా ప్రభుత్వం మారడంతో తన రాజీనామాను సీఎస్‌కు రాధాకిషన్‌ రావు పంపించారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి కూడా రాజీనామా చేశారు.

రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్‌లు సైతం రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖలు పంపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో సోమ భరత్‌ కుమార్ (ఛైర్మన్‌, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్), జూలూరి గౌరీ శంకర్ (ఛైర్మన్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ), పల్లె రవి కుమార్ గౌడ్ (ఛైర్మన్‌, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్), డాక్టర్ ఆంజనేయ గౌడ్ (ఛైర్మన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ), మేడె రాజీవ్ సాగర్ (ఛైర్మన్‌, ఫుడ్‌ కార్పొరేషన్‌), దూదిమెట్ల బాలరాజు యాదవ్ (ఛైర్మన్‌, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ), గూడూరు ప్రవీణ్ (ఛైర్మన్‌, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్), గజ్జెల నగేష్ (ఛైర్మన్‌, బేవరేజెస్ కార్పొరేషన్), అనిల్ కూర్మాచలం (ఛైర్మన్‌, ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్), రామచంద్ర నాయక్ (ఛైర్మన్‌, ట్రైకార్), డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (ఛైర్మన్‌, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ), రవీందర్ సింగ్ (ఛైర్మన్‌, పౌర సరఫరాల సంస్థ), జగన్మోహన్ రావు (ఛైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్), వలియా నాయక్ తదితరులు ఉన్నారు.

Latest articles

More like this