Imported Liquor: ఇండియన్ లిక్కర్ మార్కెట్‌లో సరికొత్త ట్రెండ్ మొదలైంది. విదేశీ బ్రాండ్లు, ముఖ్యంగా స్కాచ్ విస్కీ ప్రియులకు ఇది శుభవార్త. దిగుమతి సుంకాల తగ్గింపుతో స్కాచ్ విస్కీ మరింత మందికి అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొన్ని బ్రాండ్ల ధరలు 6 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గాయి. 2025లో బ్రిటన్ నుంచి భారత్‌కు జరిగిన స్కాచ్ విస్కీ ఎగుమతుల విలువ 286 మిలియన్ పౌండ్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.3,614 కోట్లు. ఇది సుమారు 22 కోట్ల బాటిళ్లకు సమానం. ప్రస్తుతం అమ్మకాల విలువ పరంగా అమెరికా, ఫ్రాన్స్ తర్వాత భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. అయితే, తాజా సుంకాల తగ్గింపుతో భవిష్యత్తులో ఈ అమ్మకాలు మరింత ఊపందుకుని, మార్కెట్ సమీకరణాలు మారిపోనున్నాయని వర్గాలు భావిస్తున్నాయి.

ఆందోళన వ్యక్తం చేస్తున్న CIABC

అయితే, దిగుమతి సుంకాల తగ్గింపుపై దేశీయ మద్యం తయారీదారుల సమాఖ్య ‘CIABC’ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. విదేశీ బ్రాండ్లతో దేశీయ కంపెనీలు సమానంగా పోటీ పడేందుకు వీలుగా పన్నుల విధానంలో సమతుల్యత పాటించాలని కేంద్రాన్ని కోరుతోంది. కేవలం దిగుమతి సుంకాన్ని తగ్గించినంత మాత్రాన వినియోగదారుడికి బాటిల్ తక్కువ ధరకు లభిస్తుందని చెప్పలేమని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించే స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు, రిటైలర్ల కమిషన్లు కూడా తుది ధరను నిర్ణయిస్తాయని పేర్కొంది. ఒకవేళ విదేశీ ఉత్పత్తులకు మితిమీరిన రాయితీలు కల్పిస్తే, దేశీయ పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.

వ్యూహాలు రచిస్తున్న ఇండియన్ కంపెనీలు

విదేశీ స్కాచ్ విస్కీ నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో భారతీయ బ్రాండ్లు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లకు ధీటుగా నాణ్యతను పెంచేందుకు దేశీయ తయారీదారులు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. డిస్టిలేషన్, మెచ్యూరేషన్ ప్రక్రియల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ, స్వదేశీ ప్రీమియం విస్కీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా, సుంకాల తగ్గింపు, దేశీయ కంపెనీల మధ్య పోటీతో భారత లిక్కర్ మార్కెట్ రానున్న రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తే, చివరకు వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి..