శ్రావణమాసం సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ అధికారులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం కావడం వల్ల ఆ పేరుతో ఏర్పడిన శ్రావణమాసం అంటే శ్రీమహావిష్ణువు ధర్మపత్ని లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనది. శ్రావణమాసంలో చేసే నోములు, వ్రతాలు, పూజల వల్ల లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రావణమాసం రెండవ శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసంలో మహాలక్ష్మిని పూజించడం వల్ల పసుపు కుంకాలతో, సౌభాగ్యంతో ఉంటారని భక్తులు అమ్మవారిని కొలుస్తుంటారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణమాసం సందర్భంగా నాలుగో శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.