Beware of Diwali Gift Scams: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. ఇంటింటా సందడి, కొత్త బట్టలు, బహుమతులు, స్వీట్లతో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాలకు పదును పెడుతున్నారు. పండుగ ఆనందాన్ని ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో వస్తున్న నకిలీ దీపావళి గిఫ్ట్ ఆఫర్లు, బంపర్ ధమాకా సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వాట్సాప్‌లో ఒక సందేశం విపరీతంగా చక్కర్లు కొడుతోంది. “అవును నిజమే.. దీపావళి సందర్భంగా నాకు రెండు వేలు వచ్చాయి. నిజంగా ఒక్కసారి ఓపెన్ చేసి క్లిక్ చేయి ఫ్రెండ్.. నీకు డబ్బులే డబ్బులు.. దీపావళి బంపర్ ధమాకా” అంటూ ఆకర్షణీయమైన సందేశాన్ని పంపిస్తున్నారు. ఈ మెసేజ్ చూసిన చాలామంది నిజంగానే డబ్బులు వస్తాయేమోనని ఆశపడుతున్నారు. ముఖ్యంగా తమకు తెలిసిన స్నేహితులు, బంధువుల నుంచి ఈ సందేశం రావడంతో ఎలాంటి అనుమానం లేకుండా లింక్‌పై క్లిక్ చేస్తున్నారు. సరిగ్గా ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారుతోంది.

ఒక్క క్లిక్‌తో మీ డబ్బులు పోయినట్లే..!

ఈ నకిలీ లింకుల వెనుక సైబర్ నేరగాళ్ల మోసపూరిత వ్యూహాలు దాగి ఉంటాయి. కొన్ని లింకులు నకిలీ వెబ్‌సైట్లకు తీసుకెళ్లి వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం, ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని అడుగుతాయి. మరికొన్ని లింకులు హానికరమైన అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేయించే ప్రమాదం ఉంది. వాటిని నమ్మి వివరాలు అందించినా, అనుమానాస్పద అప్లికేషన్లకు అనుమతులు ఇచ్చినా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బాధితుల వాట్సాప్ ఖాతాను స్వాధీనం చేసుకోవడానికి కూడా నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నకిలీ వెరిఫికేషన్ సందేశాలు, ఓటీపీలు, డివైజ్ లింకింగ్ అభ్యర్థనలను ఉపయోగిస్తున్నారు. ఒకరి ఖాతాపై నియంత్రణ సాధించిన తర్వాత వారి కాంటాక్ట్స్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు అదే మోసపూరిత సందేశాలను పంపిస్తున్నారు. దీంతో ఒకరి నుంచి మరొకరికి ఈ మోసం వేగంగా వ్యాపిస్తోంది.

మోదీ గిఫ్ట్‌ పేరుతో ఫ్రాడ్ లింక్స్

ప్రధాని మోదీ పేరుతో రూ.8,000 ఉచిత గిఫ్ట్ ఇస్తామంటూ సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వస్తున్న లింకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి లింకులను క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని, మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

స్నేహితులు పంపినా వెంటనే నమ్మొద్దు

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీకు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు పంపిన లింక్ అయినా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే అతని ఖాతా ఇప్పటికే సైబర్ నేరగాళ్ల నియంత్రణలో ఉండవచ్చు. ఉచితంగా డబ్బులు వస్తాయనే ఆశతో తెలియని లింకులను తెరవడం, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం, ఓటీపీలు పంచుకోవడం వంటి పొరపాట్లు చేయకూడదు. దీపావళి పండుగ వేళ మీ ఆనందాన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లో పెట్టకండి. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండండి. వాట్సాప్‌లో వచ్చే నకిలీ గిఫ్ట్ ఆఫర్లను ఇతరులకు ఫార్వార్డ్ చేయకండి. ఒకవేళ అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసినా వెంటనే బ్యాంకు లావాదేవీలను పరిశీలించి, అవసరమైతే బ్యాంకును సంప్రదించండి. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి.. దీపావళి సందర్భంగా ఉచితంగా డబ్బులు వస్తాయనే ఆశతో ఒక్క క్లిక్ చేస్తే మీ కష్టార్జితం ప్రమాదంలో పడవచ్చు. పండుగను ఆనందంగా జరుపుకోండి.. అప్రమత్తంగా ఉండండి.. మీ డబ్బులను భద్రంగా కాపాడుకోండి.