స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడి సీఐడీ విచారణ ఉదయం ప్రారంభం అయింది. మొదటి రోజు విచారణ ముగిసింది. మొత్తం 9 మంది అధికారుల టీం బాబును విచారిస్తుంది. న్యాయవాదుల సమక్షంలోనే.. కాన్ఫరెన్స్ హాల్లో ఈ విచారణ జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో ఇంటరాగేషన్ జరుగుతోంది. విచారణ ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయగా.. విచారణ పూర్తయ్యాక కూడా వైద్యులు పరీక్షలు చేయనున్నారు. విచారణ ప్రక్రియ మొత్తం సీఐడీ డిపార్ట్మెంట్ వీడియోగ్రఫీ తీస్తున్నది. జైలు పరిసర ప్రాంతాల్లో రెండంచెల భారీ బందోస్తును అధికారులు ఏర్పాటు చేశారు. రెండు అంబులెన్సులు సైతం జైలు లోపల సిద్ధం చేశారు.
CID DSP ధనుంజయుడు నేతృత్వంలో జరుగుతున్న విచారణలో తొమ్మిది మంది అధికారులతో పాటు ఇద్దరు లాయర్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. వి.విజయ్‌భాస్కర్, ఎ.లక్ష్మీనారాయణ, ఎం.సత్యనారాయణ, మోహన్, రవికుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, రంగనాయకులు, వీరితో పాటు మరో ఇద్దరు మధ్యవర్తులు, వీడియోగ్రాఫర్ ఒకరు ఉన్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, గింజుపల్లి సుబ్బారావు ఉన్నారు. ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండురోజుల పాటు విచారణ సాగనుంది. కస్టడీకి తీసుకు వెళ్లేముందు, కస్టడీ ముగిసిన తర్వాత చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. విచారణకు సీఐడీకి చెందిన వీడియో గ్రాఫర్ కి మాత్రమే అనుమతి ఉంది. అంతేకాదు విచారణకు సంబంధించిన తీసిన వీడియోని సీల్డ్ కవర్ లో కోర్టుకి సమర్చించాల్సి ఉంది. ఇవాళ విచారణ ముగిసింది. ఆదివారం కూడా సీఐడీ విచారణ జరగనుంది.