రేవంత్ సర్కార్ ఉచిత ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తే ఎంతమందికి ఇవ్వాలి అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికార యంత్రాంగం గణాంకాలు రెడీ చేసింది. రాష్ట్రం మొత్తం మీద వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 5,279 డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, వృత్తి, వివిధ మేనేజ్మెంట్ కాలేజీలు ఉండగా అందులో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 1,784 కాలేజీలు ఉన్నాయి. మొత్తమ్మీద ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ, ఇతరత్రా కోర్సులు చదువుతున్న పేదల విద్యార్థినులు సుమారు 5 లక్షల మంది వరకు ఉండగా.. వీరిలో 2 లక్షల మంది మహానగర పరిధిలో ఉన్నట్లు ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో సైతం ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70 వేల మంది వరకు ఉండవచ్చని అంచనా. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేలా నిబంధనల రూపకల్పన జరుగుతుంది.
ఎలక్ట్రిక్ స్కూటీల పథకం పెద్ద ఖర్చుతో కూడుకున్నదే. బహిరంగ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటీ సామర్థ్యం బట్టి రూ.40 వేల నుంచి రూ. 1.5 లక్షకు పైగా పలుకుతోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఎలక్ట్రిక్ టు వీలర్లపై ఫేమ్ 2 పథకం కింద రాయితీ అందిస్తోంది. ఈ పథకం కింద ఒక్కో ఈవీ టు వీలర్‌కు దాని ఎక్స్–ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 40 శాతానికి సమానంగా సబ్సిడీ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రాయితీలకు అనుగుణంగా ఈ పథకం అమలు కోసం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. తొలి విడతలో సర్కారు కాలేజీలో చదువుతున్న విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే సుమారు 70 వేల మంది వరకు లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక్క స్కూటీకి సగటున రూ. 50 వేల చొప్పున ధర లెక్కిస్తే సుమారు రూ. 350 కోట్ల ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సబ్సిడీ లేకుండా మాత్రం లెక్కిస్తే ఖర్చు రెట్టింపు కావచ్చని అధికారులు అంచనా వెస్తున్నారు.
ఎలక్ట్రిక్ స్కూటీలకు డ్రైవింగ్ లైసెన్స్‌లు తప్పనిసరి కానుంది. లైసెన్స్ తీయడం విద్యార్థునులకు కత్తిమీద సామే. చాలా మందికి వాహనం నడపడం వచ్చినప్పటికీ.. డ్రైవింగ్ లైసె¯న్సులు లేవు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలతో రోడ్లు ఎక్కుతున్నారు. వారికి రహదారి భద్రత గురించి అవగాహన తక్కువగా ఉండటంతో.. రోడ్డు ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆధార్, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్ బుక్ లేదా పాస్‌పోర్ట్, అడ్రస్ ప్రూఫ్, టెన్త్ మెమో, పాన్ కార్డు అవసరం ఉంటుంది. డ్రైవింగ్ పరీక్షలో నెగ్గితే ముందుగా లెర్నింగ్ లైసెన్స్..ఆ తర్వాత పర్మనెంట్ లైసెన్స్ ఇస్తారు.విద్యార్థినులకు ఎల్రక్టానిక్ స్కూటర్లు అందుబాటులో వస్తే మరింత ట్రాఫిక్ పెరిగే అవకాశముంది. 18 సంవత్సరాలకు పైబడిన వారు అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ, పీజీ, ఇతర మేనేజ్మెంట్ కోర్సులు, ఇంజినీరింగ్ విద్యార్థులే ఉంటారు. మహానగర పరిధిలో డిగ్రీ, పీజీ, వివిధ మేనేజ్మెంట్, వృత్తి కోర్సులు అభ్యసిస్తున్న వారికంటే ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థినులే ఎక్కువ. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థినులు అధికంగా ఉన్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పథకం కింద కేవలం సర్కారు కాలేజీ విద్యార్థినులకు ప్రాధాన్యమిస్తే ప్రైవేటు ఇంజినీరింగ్ విద్యార్థినులకు అర్హత లభించదు.