మిచౌంగ్ తీవ్ర తుఫాన్ ఏపీ, తమిళనాడులో భారీవర్షాలతో అతలాకుతలం చేస్తోంది. బాపట్ల సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకింది. తుఫాను తీరాన్ని దాటింది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, నెల్లూరు జిల్లాలో గాలుల తీవ్రత కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు కొనసాగనున్నాయి. తుఫాను ఉత్తర దిశగా నెమ్మదిగా ముందుకు కదులుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లు కొన్నిసార్లు 110 కిలోమీటర్లు గాలులు వీచనున్నాయి. ముంపు ప్రాంతాల్లో సముద్రం కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మచిలీపట్నం నీటమునిగింది. మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారు.
ఇటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఓ మోస్తారుగా కురుస్తున్నాయి. మరో 24 గంటల పాటు వర్షాలు కొనసాగనున్నాయి.చెన్నైలో భారీవర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చెన్నై నగరం స్తంభించిపోయింది. 14 రైల్వే సబ్‌వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నగరం, చుట్టుపక్కల జిల్లాల్లో మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే చెన్నైలో మోహరించారు.చెన్నై-మైసూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్ కోవై ఎక్స్‌ప్రెస్, కోయంబత్తూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు బృందావన్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రద్దు చేశారు. దీంతోపాటు సబర్బన్ రైళ్లను కూడా రద్దు చేశారు.