HomeNewsబీజేపీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం

బీజేపీకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అల్టిమేటం

Published on

తెలంగాణ ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో మిగులుతారనేది బీజేపీలో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. బీజేపీ, జనసేన పార్టీల పొత్తు పంచాయతీ ఇంకా తెగడం లేదు. జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో బీజేపీ నాయకుల నుంచి చాలా అభ్యంతరాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి సీటు పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. శేరిలింగంపల్లి సీటు విషయంలో జనసేన పార్టీకి కేటాయించవద్దని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేస్తున్నారు. చేవేళ్ల ఎంపీ సీటును కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇక్కడ శేరిలింగంపల్లి నియోజకవర్గం కూడా చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఓట్లలో 30 శాతం ఓట్లు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలవాలంటే శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఓట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చాలా కీలకం.

మరోవైపు.. తనకే టికెట్ వస్తుందని భావిస్తూ.. బీజేపీ తరపున రవి యాదవ్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. రవి యాదవ్ కే శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వాలంటూ తెలంగాణకు చెందిన బీజేపీ ముఖ్య నేతలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. జనసేనకు శేరిలింగంపల్లి టికెట్ కేటాయించవద్దని కోరుతున్నారు. ఒకవేళ జనసేన పార్టీకి శేరిలింగంపల్లి, తాండూరు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు తన అభిప్రాయాన్ని చెప్పేశారు.బీజేపీలో కీలకంగా ఉన్న వివేక్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Latest articles

More like this