సీజేపీకి మద్దతుగా జగన్ ట్వీట్
YS Jagan Supports CJP: సీజేపీకి మద్దతుగా ట్వీట్ చేసిన జగన్

YS Jagan Supports CJP: వైసీపీ-సీజేపీ అనుబంధంపై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాక్రోచ్ జనతాపార్టీకి మద్దతిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే థాంక్స్ అన్నా అంటూ పోస్ట్ పెట్టారు. సడెన్‌గా సీజేపీతో వైసీపీ అనుబంధం చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వైసీపీ-సీజేపీ బంధంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఘాటుగా స్పందించారు. ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వైఎస్ జగన్‌తో కాక్రోచ్‌పార్టీ చేతులు కలిపిందని ఫైర్ అయ్యారు.
ఏపీలో తాము కూడా కాక్రోచ్‌లమే అంటూ గతంలోనే జగన్ చేసిన కామెంట్లను కొందరు నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి చిన్న చెక్కముక్క దొరికినా పెద్ద ఆసరానే. కూటమితో భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్న వేళ సీజేపీ రూపంలో వైసీపీకో పెద్ద దిక్కు దొరికినట్లుంది. సీజేపీకు మద్దతుగా జగన్ చేసిన ట్వీట్‌ని స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. కేసులున్నా పట్టించుకోకుండా తమ అధినేత కేంద్రానికి ఎదురెళ్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైసీపీ కేడర్ సంబరాలు చేసుకుంటోంది. కేంద్రాన్ని ఢీకొనే గట్స్ ఉన్న లీడర్ వన్ అండ్ ఓన్లీ అంటూ జగన్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. పనిలో పనిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ రాహుల్‌తో కలిసి అడుగులేస్తే బాగుంటుందని కొందరు అడ్వైజ్ ఇస్తున్నారు.
అయితే కాక్రోచ్ జనతా పార్టీని పెంచి పోషిస్తున్న వారసత్వ పార్టీల గుంపులో జగన్ కూడా చేరారంటూ ప్రత్యర్థులనుంచి కౌంటర్లు మొదలయ్యాయి. జగన్ కేసుల మీద రోజువారీ విచారణకు కోర్టు నిర్ణయం వెలువడగానే… కేంద్రాన్ని విమర్శిస్తూ ట్వీట్లు మొదలు పెట్టేశారంటూ సోషల్ మీడియాలో కొందరు సెటైర్లేస్తున్నారు. సీజేపీకి తెర వెనుక ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ వైసీపీపై అప్పుడే కొందరు దుమ్మెత్తిపోస్తున్నారు.



