Uttarakhand Ankita Case: 19 ఏళ్ల అమ్మాయి. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఓ రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఉద్యోగంలో చేరిన నెలరోజులకే అనూహ్యంగా హత్యకు గురైంది. డ్యూటీకి వెళ్లిన యువతి రుషికేశ్‌ సమీపంలోని చిల్లా కెనాల్‌లో శవమై కనిపించింది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.

ఉత్తరాఖండ్‌కు చెందిన 19ఏళ్ల అంకితాభండారీ రుషికేశ్‌ సమీపంలోని ఓ రిసార్ట్‌లో 2022 ఆగస్టులో రిసెప్షనిస్ట్‌గా చేరింది. ఆ రిసార్ట్‌ ఓనర్‌ బీజేపీ నాయకుడు వినోద్‌ ఆర్య. అతని కుమారుడు పులకిత్‌ ఆర్య ఆ రిసార్ట్‌ నిర్వహణ బాధ్యతలు చూసేవాడు. విధుల్లో చేరిన నెలరోజులకే అంకిత అనూహ్యంగా అదృశ్యమైంది. రిసార్ట్‌కి వచ్చే వీఐపీ అతిథులతో సన్నిహితంగా ఉండేందుకు నిరాకరించడమే ఆమె చావుకు కారణమైందని విచారణలో తేలింది.

పులకిత్‌ ఆర్యతో పాటు అతని సహాయకులు అతిథులకు ప్రత్యేక సేవలు అందించాలని అంకితాపై ఒత్తిడి తెచ్చారు. ఆమె దీన్ని ప్రతిఘటించంతో వాదన పెరిగి చివరికి ఘర్షణకు దారితీసింది. దీంతో అంకితాభండారీని బలవంతంగా ఒక వాహనంలో తీసుకువెళ్లి, రుషికేశ్‌ సమీపంలోని చిల్లా కెనాల్‌లో పడేశారు. ఆరురోజుల తర్వాత అంకిత మృతదేహం దొరికింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది.

నిందితులకు శిక్షపడింది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అయితే అంకిత తల్లిదండ్రులు న్యాయంకోసం మళ్లీ రోడ్డెక్కారు. కారణం సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్‌ గౌతమ్‌ నియామకం. తన కూతురి చావుకు కారణమైన ఆ వీఐపీ దుష్యంతేనని అప్పట్లోనే ఆరోపించారు అంకిత తండ్రి. అలాంటి వ్యక్తిని గవర్నర్‌గా నియమించి కేంద్రప్రభుత్వం రాజ్యాంగ రక్షణ కల్పించిందని అంకిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇండియాగేట్‌ దగ్గర నిరసనకు దిగిన అంకిత కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అప్పట్లో రుషికేష్‌ రిసార్ట్‌కి వెళ్లిన ఆ వీఐపీని తాను కానంటున్నారు సిక్కిం గవర్నర్‌గా నియమితుడైన దుష్యంత్‌.