నవంబర్ 1.. బీజేపీలో మొదలైన టెన్షన్
BJP emergency meeting: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీ కీలక నేతలు భేటీ అయ్యారు. నవంబర్ ఒకటో తేదీన ఇండియా కూటమి ర్యాలీ నేపథ్యంలో బీజేపీ సమావేశంపై ప్రాధాన్యత నెలకొంది..

BJP emergency meeting: నవంబర్ 1.. బీజేపీలో మొదలైన టెన్షన్
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘం కార్యాలయ ముట్టడికి ఇండియా కూటమి ఎంపీలు ప్రయత్నించారు. సీఈసీ అపాయింట్మెంట్ ఇవ్వాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. రాజ్యాంగ ప్రకారం కుదరదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఎస్ఐఆర్లో అక్రమాలు, ఓటర్ల తొలగింపు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలంటూ ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ సభకు ఇండియా కూటమి ఎంపీలు, పలు పార్టీల నేతలు పాల్గొననున్నారు.
బీజేపీ అత్యవసర సమావేశం
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేయడానికి వీల్లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, ఎవరైనా జంతర్ మంతర్‌లో ధర్నా చేయాలని చూస్తే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారు. ఇప్పటికే సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని తిహార్ జైలుకు తరలించారు. పోలీసు కస్టడీ ముగియడంతో ప్రస్తుతం ఢిల్లీలోని మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరగబోయే ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ అధిష్ఠానం ఫోకస్ పెంచింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అమిత్ షాతో పాటు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పలువురు కీలక నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి నిరసనలకు ధీటుగా ఎలా సమాధానం ఇవ్వాలనే దానిపై అమిత్ షా సమాలోచనలు చేసినట్లు సమాచారం. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది..
నవంబర్ 1న దేశం మొత్తం కదులుతోంది: ఇండియా కూటమి
నవంబర్ ఒకటిన ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరగబోయే ఆందోళనకు దేశం మొత్తం కదులుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను అడ్డుపెట్టుకొని మోదీ, అమిత్ షా రాజకీయం చేస్తున్నారని ఇండియా కూటమి నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని కోరుతున్నారు. మరోవైపు, జ్ఞానేశ్ కుమార్‌ను అభిశంసించాలని కోరుతూ స్పీకర్‌కు నోటీసులు ఇచ్చినట్లు ఇండియా కూటమి నేతలు చెబుతున్నారు. ఎన్నికల సంఘంపై పోరాటాన్ని ఆపేది లేదని, 13 కోట్ల మంది ఓట్లను తిరిగి పునరుద్ధరించడంతో పాటు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
దీపావళి తర్వాత సీజేపీ నిరసనలు
సీఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాసంఘాల నేతలతో పాటు పలువురు సీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సుమారు ఏడు వేల మందిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో దీపావళి తర్వాత మరోసారి ఢిల్లీ వేదికగా ఉద్యమం చేస్తామని సీజేపీ నేతలు చెబుతున్నారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. దీంతో దీపావళి తర్వాత ఢిల్లీలో ఏం జరుగుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ఒకవైపు ఇండియా కూటమి నిరసనలు, మరోవైపు సీజేపీ ఆందోళనలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం చర్చలు జరుపుతోంది.



