దేశ భాషలందు తెలుగు లెస్స
Telugu Language Pride: దేశభాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో చెప్పారు. అలాంటి తెలును పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది

Telugu Language Pride: తెలుగు భాష కేవలం మాటల సమాహారం కాదు, అది శతాబ్దాల చరిత్రను, సాహిత్యాన్ని, సంస్కృతిని తనలో మోసుకెళ్తున్న మహత్తర వారసత్వం. శాతవాహనుల కాలం నుంచి తెలుగునేల తనదైన గుర్తింపును సంపాదించుకుంది. కాకతీయుల కాలంలో ఓరుగల్లు తెలుగు శక్తికి ప్రతీకగా నిలిచింది. రామప్ప శిల్పం, కాకతీయుల చెరువులు ఆ కాలపు సృజనాత్మకతకు నేటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. విజయనగర సామ్రాజ్యం కాలంలో తెలుగు సాహిత్యం మరో స్వర్ణయుగాన్ని చూసింది. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల నుంచి వెలువడిన సాహిత్య సంపద తెలుగు భాషకు అపారమైన గౌరవాన్ని తెచ్చింది. కానీ తెలుగు వైభవం ఒకే రాజ్యంలో ఒకే ప్రాంతంలో పుట్టలేదు. తెలంగాణలో ఒక సాహిత్య ప్రవాహం, ఆంధ్రలో మరో ప్రవాహం, రాయలసీమలో మరో జీవనానుభవం. ఇవన్నీ కలిసి తెలుగు సాహిత్యాన్ని ఇంత విస్తృతంగా తీర్చిదిద్దాయి.
నన్నయ, తిక్కన, ఎర్రనల మహాభారతం నుంచి పోతన భాగవతం వరకు, శ్రీనాథుని కావ్య వైభవం నుంచి వేమన జ్ఞానం వరకు, అన్నమయ్య సంకీర్తనల నుంచి త్యాగయ్య కీర్తనల వరకు, ఇవన్నీ మన ఉమ్మడి తెలుగు సాహిత్య సంపదే. తరువాత గురజాడ, కందుకూరి, త్రిపురనేని రామస్వామి వంటి సంస్కర్తలు సమాజాన్ని ప్రశ్నించారు. తెలంగాణ నేల నుంచి కాళోజీ, దాశరథి వంటి మహాకవులు ప్రజల బాధను, ఆత్మగౌరవాన్ని, స్వేచ్ఛా ఆకాంక్షను తమ కలంతో పలికించారు. ఇవన్నీ ఏ ప్రాంతపు గోడలో బంధించగలము? ఎవ్వరినీ కాదు. వాళ్లు అందరూ తెలుగు సాహిత్య ఆకాశంలోని నక్షత్రాలు. ఒక నక్షత్రాన్ని “ఇది మా ప్రాంతానిది” అని వేరుచేయడం ఎంత అసంబద్ధమో, తెలుగు మహనీయులను ప్రాంతీయ గీతలతో విడదీయడం కూడా అంతే అసంబద్ధం. మనకు నిజంగా కోల్పోవడానికి ఎక్కువే ఉంది. ఈ రోజుల్లో ప్రపంచం ముందుకు పోతుంటే మన లోపలి తగువుల్లో శక్తిని వృథా చేయకూడదు. తెలుగు భాషా ఐక్యతే మన నిజమైన బలం. శాతవాహనులు మనకు మూలాలను ఇచ్చారు, కాకతీయులు నిర్మాణ శక్తిని చూపించారు, విజయనగరం వైభవాన్ని చూపించింది, కవులు పదానికి ప్రాణం పోశారు, సంస్కర్తలు ఆలోచన ఇచ్చారు, ప్రజాకవులు ఆత్మగౌరవాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనది. యాసలు ఎన్నైనా తెలుగు భాష ఒక్కటే. ప్రాంతాలు ఎన్నైనా మన సంస్కృతి ఒక్కటే. చరిత్ర ఎన్నో అధ్యాయాలున్నా, తెలుగు వారసత్వం ఒక్కటే. గతాన్ని గౌరవిస్తూ, భవిష్యత్తు కోసం తెలుగు మాట్లాడాలి, తెలుగు చదవాలి, తెలుగు రాయాలి, తెలుగులో ఆలోచించాలి. జయహో తెలుగు భాష! జయహో తెలుగు సాహిత్యం! జయహో తెలుగుజాతి!



