RGV on Ramayana: దీపావళి సందర్భంగా థియేటర్లలో రామాయణ పార్ట్‌-1 సినిమా దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఒకవైపు భారీ వసూళ్లతో వార్తల్లో నిలుస్తుంటే.. మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో మరింత చర్చనీయాంశంగా మారుతోంది. తాజాగా ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సినిమాల విషయంలో తనదైన శైలిలో స్పందించే ఆర్జీవీ.. రామాయణ పార్ట్‌-1 ప మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను కేవలం ఒక భక్తి చిత్రంగా చూడకూడదని, ఇందులో భక్తి మాత్రమే కాకుండా ప్రేక్షకులను కదిలించే శక్తి కూడా ఉందని వర్మ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. సినిమాపై వచ్చే విమర్శలను చిత్రబృందం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు.

విమర్శలకు భయపడాల్సిన అవసరం లేదు

రామాయణ లాంటి ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించడం సాధారణమైన విషయం కాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా కోసం దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా చేసిన ప్రయత్నం ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును తెరకెక్కించడానికి పడిన శ్రమతో పోలిస్తే బయట వినిపించే విమర్శలు చాలా చిన్నవని పేర్కొన్నారు. సినిమా గురించి ఎవరు ఏమనుకున్నా.. చిత్రబృందం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగాలని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రాముడి పాత్రను చూపించిన విధానం తనను ఆకట్టుకుందని వర్మ పేర్కొన్నారు. కథకు అతీతంగా ఉండే ఒక దైవిక ప్రతిరూపంలా కాకుండా.. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడే వ్యక్తిగా రాముడిని ఆవిష్కరించారని విశ్లేషించారు. సినిమాలోని యాక్షన్, హింసాత్మక సన్నివేశాలు కూడా కథలోని పరిణామాలకు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు.

రణ్‌బీర్‌ యాక్షన్‌కు ఆర్జీవీ ఫిదా…!

రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, రావణుడి యశ్ నటించిన తీరుపై ఆర్జీవీ ప్రత్యేకంగా స్పందించారు. ముఖ్యంగా సీతాదేవి అపహరణ తర్వాత ఖాళీగా మిగిలిన ఆశ్రమంలో రాముడు కనిపించే సన్నివేశం తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. ఆ సన్నివేశంలో రణ్‌బీర్ పలికించిన భావోద్వేగాలు అద్భుతమని కొనియాడారు. మాటలతో చెప్పలేని బాధను ఆయన నటన ద్వారా వ్యక్తీకరించిన తీరు, దాన్ని కెమెరా బంధించిన విధానం గొప్పగా ఉందని ప్రశంసించారు. ఇక రావణుడి పాత్రలో యశ్ కనిపించిన తీరు కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.

రూ.500 కోట్లు కొల్లగొట్టిన సినిమా

రామాయణ పార్ట్‌-1 సినిమా విడుదలైన మూడు రోజుల్లో రూ.500 కోట్లు కొల్లగొట్టినట్లు సినిమా నిర్మాతలు ప్రకటించారు. మరో వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్లులోకి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. రామాయణ పార్ట్‌-1 విషయంలో మాత్రం పాజిటివ్‌గా స్పందించడం విశేషం. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సాధారణంగా సినిమాలపై తనదైన కోణంలో విశ్లేషణ చేసే ఆర్జీవీ.. ఈసారి రామాయణ చిత్రాన్ని ఇంతలా ప్రశంసించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.