Revanth Reddy Farmers Advisory

తాగడానికే నీళ్లు
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచన చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీళ్లు కేవలం తాగునీటి అవసరాలకే సరిపోతాయని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. ఎల్‌నినోపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని రేవంత్(Revanth Reddy Farmers Advisory) హెచ్చరించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందరం కలిసికట్టుగా పరిస్థితులను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్‌కు సవాల్
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉంటే తెలంగాణలోనే కరవు వచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌ ఫైర్ అయ్యారు. బావబామ్మర్దులు ఊళ్లపై పడి అబద్ధాలు చెబుతారని, వారి మాటలు విని రైతులు నష్టపోవద్దని సూచించారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోకపోవడం వల్లే ఆంధ్రకు నీళ్లు వెళ్తున్నాయన్న బీఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదని సీఎం అన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 16 టీఎంసీల నీరు ఉంటేనే కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గేట్లు దించే పరిస్థితి కూడా లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతి వల్లే ఈ మూడు బ్యారేజీలు పనిచేయడం లేదని ఆరోపించారు. పాలమూరు నుంచి గెలిచిన కేసీఆర్‌ భారీ బడ్జెట్‌ ఖర్చు చేసినా అక్కడి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని రేవంత్‌(Revanth Reddy Farmers Advisory) విమర్శించారు. వచ్చే డిసెంబరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్‌ అనుమతి కోరుతున్నామని, ఆ సమావేశాల్లో ఎల్‌నినో, కాళేశ్వరం అంశాలపై చర్చించేందుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

కేటీఆర్ గడ్డంపై సెటైర్లు
కేటీఆర్‌ వేషభాషలు మార్చుకున్నా ప్రజలు నమ్మరని రేవంత్‌ ఎద్దేవా చేశారు. గడ్డం పెంచుకున్నంత మాత్రాన తనలా మారలేరన్నారు. తాను మూడేళ్లుగా గంట కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నానని చెప్పారు. సర్పంచ్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని, అబద్ధాలు ప్రచారం చేస్తున్న కుటుంబాన్ని ప్రజలు బహిష్కరించాలన్నారు. మూడు రోజుల కొడంగల్‌ నియోజకవర్గ పర్యటనలో భాగంగా హకీంపేట, దుద్యాల మండలాల్లో రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. హకీంపేటలో నిర్మిస్తున్న ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులను పరిశీలించారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో కొడంగల్‌ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం ముందుకు రాలేదని రేవంత్ (Revanth Reddy Farmers Advisory) ఆరోపించారు. తమ ప్రభుత్వం మాత్రం భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం ఇస్తోందన్నారు. హైదరాబాద్‌-లగచర్ల ప్రాంతాన్ని ఢిల్లీ-నోయిడా తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. హకీంపేటలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.