ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడికి స్వల్ప ఊరట లభించింది. అంగళ్లు కేసులో చంద్రబాబుకు శుక్రవారం ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. లక్షరూపాయలు పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.మొన్న రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై విచారణ ప్రక్రియను న్యాయస్థానం ఈ నెల 16 వరకూ నిలిపేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. పీటీ వారెంటు విధానంలో తప్ప జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పిటిషనర్‌ను నేరుగా అరెస్టు చేసే ఉద్దేశం లేదని సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ లిఖితపూర్వకంగా సమర్పించిన హామీని న్యాయస్థానం రికార్డుచేసింది. విచారణను16వ తేదీకి వాయిదా వేసింది. ఇక నేడు అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.