ఎంతోమంది ఉన్నత విద్యావంతుల్ని తయారుచేసే విద్యాలయాలు అరాచకశక్తులకు అడ్డాగా మారుతున్నాయి. కాకతీయ యూనివర్శిటీలోని నిర్మానుష్య ప్రాంతాలు క్షుద్ర పూజలు సాగుతున్నాయి. తాజాగా వెలుగుచూస్తున్న వరుస ఘటనలు ఒకవైపు విద్యార్థులను, మరోవైపు పరిసర ప్రాంత ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. ఇంతకీ.. యూనివర్సిటీ పరిసరాల్లో క్షుద్రపూజలు చేస్తుందెవరు?.. ఆ యూనివర్సిటీ కాంట్రవర్శీలకు కేరాఫ్‌గా ఎందుకు మారుతోంది.? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో ఉస్మానియా తర్వాత ప్రతిష్టాత్మక యూనివర్శిటీ కాకతీయ.. అయితే ఇటీవల కాలంలో వరంగల్‌కాకతీయ విశ్వవిద్యాలయం కొంతమంది అక్రమార్కులకు అడ్డాగా మారింది. అసాంఘిక కార్యక్రమాలు, క్షుద్ర పూజలు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను వణికిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వెలుగు చూస్తున్న వరుస ఘటనలే అందుకు నిదర్శనమని చెప్పొచ్చు. ఎవరు చేశారో తెలియదు కానీ.. క్షుద్ర పూజలు మాత్రం కలకలం రేపుతున్నాయి.
ప్రతాపరుద్ర హాస్టల్ సమీపంలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు.క్షుద్రపూజలు జరిపిన ప్రాంతంలో నల్లకోడి, మేకను బలిచ్చారు.. నిమ్మకాయలు, గుమ్మడి కాయలతో తాంత్రిక పూజలు నిర్వహించారు.. పూజలు నిర్వహించిన ప్రాంతంలో శత్రువు బొమ్మ, అదే విధంగా పూజా సామాగ్రి కనిపించాయి. విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే.. కాకతీయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌గా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారని.. ముఖ్యంగా పౌర్ణమి-అమావాస్య తిధులలో గుట్టుచప్పుడు కాకుండా రాత్రివేళ తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అయితే.. క్షుద్ర పూజలు జరిగిన ప్రాంతంలో పోలీసులు ఒక బైక్ గుర్తించారు. ఆ బైక్ ఆధారంగా ఎన్పీడీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఎందుకు యూనివర్సిటీ ఆవరణలో క్షుద్ర పూజ నిర్వహించారు. ఎవరు టార్గెట్‌గా క్షుద్రపూజలు చేశారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది.మొత్తంగా.. యూనివర్సిటీలో సరైన భద్రత లేకపోవడం, సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. క్యాంపస్‌లో దర్జాగా క్షుద్రపూజలు నిర్వహిస్తుంటే సెక్యూరిటీ వ్యవస్థ ఏం చేస్తోంది?..అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పిన యూనివర్సిటీలో గత కొంతకాలం నుంచి జరుగుతున్న పరిణామాలు.. రాష్ట్రావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వీటిపై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు.