తిరుమల వెళ్ళేవారు జాగ్రత్తగా ఉండాలంటోంది టీటీడీ. శేషాచల కొండల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. టీటీడీ,అటవీ శాఖ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసిన బోన్లకు అదనంగా మరి కొన్ని బోన్లను అటవీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం గుర్తించేందుకు 320 ట్రాప్ కెమెరాలకీ అదనంగా మరో 200 కెమెరాలను టీటీడీ ఏర్పాటు చేసింది. శ్రీవారి మెట్టు మార్గంలో 82 కెమెరాలని అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. అలిపిరి కాలిబాట మార్గంలో ప్రస్తుతానికి జంతు సంచారం లేదని డీఎఫ్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో పలు జంతువుల సంచారాన్ని గుర్తించామన్నారు. ఈ ప్రాంతంలో జంతు సంచారంపై అధ్యయనం చెయ్యడానికి మరి కొంత సమయం పడుతుందన్నారు. కాలినడకన వచ్చే భక్తులు గుంపులుగా రావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు భద్రతా అధికారుల సూచనలు పాటించాలని, భక్తుల భద్రత తమ లక్ష్యం అంటున్నారు టీటీడీ అధికారులు.