తెలంగాణలో కాంగ్రెస్ టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. 119 అసెంబ్లి నియోజకవర్గాలలో పోటీకి 1220 మంది నేతలు దరఖాస్తు చేసుకోగా ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసి సంబంధిత జాబితాను సీల్డ్ కవర్లో ఉంచింది. ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. అయితే ఇది అంత తేలికగా ముగిసిపోయే ప్రక్రియ కాదని.. అభ్యర్థులపై ఓ అవగాహనకు వచ్చినా.. చివరి వరకూ అంటే షెడ్యూల్ వచ్చే వరకూ ప్రకటించే అవకాశం లేదని భావిస్తున్నారు.
అత్యధిక నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం భారీ పోటీ ఏర్పడింది. ఒక నియోజకవర్గం కోసం ఏకంగా 36మందికి పైగా పోటీపడడం చర్చనీయాంశంగా మారింది. ఇల్లెందు రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఈ పోటీ నెలకొంది. ఒక్కో టికెట్ కు ఐదునుంచి 8మంది యావరేజ్ న పోటీపడుతున్నారు. ఎంపిక చేసి ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచారు. అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తును పూర్తి చేసిన నేతలు నియోజకవర్గాల వారీగా ఆశావహుల ప్రాధాన్యతా సంఖ్యలను కేటాయించారు. బాగా బలంగా ఉండి విపక్ష పార్టీల అభ్యర్థులకు ధీటైన వారికి క్రమ సంఖ్య 1ని కేటాయించారు. ఇలా 2, 3 క్రమ సంఖ్యలను నేతల పేర్ల చివర పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల్లో పోటీ కోసం ఎన్నికల కమిటీలోని సభ్యులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. తమకే తుది ప్రాధాన్యతా సంఖ్య కేటాయించాలని కొందరు ఈ సమావేశంలో కోరినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ బీసీలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని భావిస్తోంది. బీఆర్ఎస్ వెనుకబడిన తరగతులకు ఇచ్చిన సీట్ల కన్నా తమ పార్టీలో ఎక్కువ సీట్లను ఈ వర్గాలకు కేటాయిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు బలమైనబీసీ అభ్యర్థుల జాబితాను విడిగా పరిశీలన చేస్తున్నారు.ఇదిలా ఉంటే పలువురు సీనియర్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ ను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారు.. దీంతో ఒక్కరికి టిక్కెట్ దక్కడమే కష్టమనుకుంటే ఒక్కో ఫ్యామిలీనుంచి రెండు నుంచి మూడు, నాలుగు టికెట్లు కోరడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.









