1 చంద్రబాబు గొడవ మాకెందుకు? ఏపీలో ర్యాలీలు చేసుకోండి? దీనిని మనం ఎలా చూడాలి?
చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు ఏం సంబంధం అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఆంధ్రప్రదేశ్‌లో అని… ధర్నాలు చేయాల్సింది అక్కడ.. కానీ హైదరాబాద్‌లో రాజకీయ ర్యాలీలు తీస్తున్నారన్నారు. పక్కింట్లో పంచాయతీని ఇక్కడ తీర్చుకుంటారా అని అడిగారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది కదా అని అన్నారు. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్ వేదిక కావాలా అని ప్రశ్నించారు. రాజమండ్రి, అమరావతి, కర్నూలులో చేయకుండా ఇక్కడ రాద్దాంతం ఎందుకు అని మంత్రి ప్రశ్నించారు.
2 సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసులో విచారణ
నవంబర్ 20 వరకూ రిలీఫ్… దీనిని బట్టి చూస్తుంటే బీజేపీ-బీఆర్ఎస్ పెవికాల్ కంటే గట్టిదైన బంధం తెలిసిపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈడీపై గతంలో దాఖలైన అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసుతో ట్యాగ్ చేసి విచారణ కొనసాగించాలని కోరారు. గత విచారణలో ఈడీ సమన్లను కూడా కవిత తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదన్నారు. నళిని చిదంబరానికి ఇచ్చినట్టే తనకు కూడా వెసులుబాటు ఇవ్వాలని కోరారు..10 రోజుల పాటు సమన్లు వాయిదా వేయడానికి ఈడీ అంగీకరించింది. కాగా.. కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 20కి వాయిదా వేసింది.ఈ నేపథ్యంలోనే నవంబర్ 20 వరకూ ఆమెకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.దీనిని బట్టి చూస్తే ఎన్నికలు ముగిసేవరకూ కవిత అరెస్ట్ లేనట్టే అని అర్థం అవుతోంది.
3 గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
తెలంగాణలో మరోసారి నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దుచేయడం, దానిని TSPSC కోర్టులో సవాల్ చేయడం తెలిసిందే. బయోమెట్రిక్ విధానం (Biometric System) ఎందుకు పెట్టలేదని న్యాయస్థానం మరోసారి ప్రశ్నించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని, అలాగే బయో మెట్రిక్‌పై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలు ఆడుతోందని విద్యార్ధులు మండిపడుతున్నారు. ఈ పరిణామాలు అధికార పార్టీకి మైనస్ అవుతాయని అంటున్నారు. 10 ఏళ్ళ తెలంగాణలో ఒక్క పరీక్ష కూడా సరిగా చేయడం చాతకాదా అని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. హైకోర్టుకూడా ప్రభుత్వం తీరుని తప్పుబట్టింది. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థ అయి ఉండి పరీక్షల నిర్వహణలో పదేపదే టీఎస్పీఎస్సీ విఫలమవుతుందని మండిపడింది. మొదటిసారి పేపర్ లీకేజ్‌తో పరీక్ష రద్దు చేశారని, రెండోసారి నిర్వహించే సమయంలోనూ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
4 ఎమ్మెల్సీల ఎంపికపై గవర్నర్ వైఖరి
తెలంగాణలో మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వ్యవహారం నడుస్తోంది. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించడం హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ ఫోన్ చేసినా వెనక్కి తగ్గలేదు గవర్నర్. దేని లెక్క దానిదే!.. అన్నట్టుగా తమిళిసై తన వైఖరిని తెలియచేశారు. ప్రభుత్వ పెద్దలతో స్నేహంగా మసలుకుంటూనే..రాజకీయ నిర్ణయాలపై నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర మంత్రిమండలి జూలై 31న జరిగిన సమావేశంలో ఆమోదించి.. ఆగస్టులో గవర్నర్‌కు పంపించింది. గతంలో కూడా పాడి కౌశిక్ రెడ్డిని కూడా గవర్నర్ తిరస్కరించారు. గవర్నర్ పదవికి తమిళిసై అర్హురాలే కాదంటూ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇటు బీజేపీ నేతలు బండి సంజయ్ గవర్నర్ నిర్ణయాన్ని సమర్ధించారు.
5 మోడీ పాలమూరు పర్యటనపై బీఆర్ఎస్ ఆగ్రహం
తెలంగాణకు ముఖ్యంగా పాలమూరుకు ఏం చేశారని ప్రధాని మోడీ పర్యటనకు వస్తున్నారని మండిపడ్డారు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఒక్క ప్రాజెక్ట్ కి జాతీయ హోదా ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పాటును అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
6 తెలంగాణలో కాంగ్రెస్ స్పీడ్
తెలంగాణ ఎన్నికలపై కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. 80 మంది అభ్యర్ధుల లిస్ట్ ఖరారు.. బీఆర్ఎస్ నుంచి వలసల నేపథ్యంలో మరిన్ని సీట్లు ఖరారుచేయాలని ఆలోచనలో ఉంది. 100 మంది అభ్యర్ధుల్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
7 చంద్రబాబు అరెస్ట్ మీద అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ పై AIMIM అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన జైలుకి ఎందుకు వెళ్ళారో అందరికీ తెలుసు. ఏపీలో జగన్ పాలన బాగుందన్నారు.