తెలంగాణలో ఒకవైపు అభ్యర్ధుల జాబితాలు విడుదల.. మరోవైపు మేనిఫెస్టోల సందడి నెలకొంది. ఇవాళ ఉదయం 55 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల కాగా… తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలనెలా భృతి అందిస్తామని ప్రకటించారు.ప్రతి రేషన్ కార్డు హోల్డర్‌కు వచ్చే ఏప్రిల్, మే నుంచి సన్నబియ్యం ఇస్తాం. ఇక దొడ్డుబియ్యం బాధ ఉండదు. ఈ స్కీంకు తెలంగాణ అన్నపూర్ణ అని పేరు పెడుతున్నాం. ప్రభుత్వంలోకి రాగానే ఇంప్లీమెంట్ చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
. తెలంగాణ భవన్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. మితగా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ తరపున గంప గోవర్ధన్, మంత్రి ప్రశాంత్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ కవిత బీ-ఫారమ్ అందుకున్నారు. ఉమ్మడి మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును అందజేశారు.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు:
- రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం.
- రైతుబంధును రూ.16 వేలు చేస్తాం.
- ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016కి పెంపు. ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెంపు.
- సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.1000 భృతి.
- తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.
- దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం.
- కేసీఆర్ బీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది.
- గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది
- గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం
- తండాలు, గోండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం
- బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం.
- రైతుబీమా తరహాలోనే పేదలకు కేసీఆర్ బీమా పథకం
- తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా
- అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.
- తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా