తెలంగాణతో పాటు యావత్ దేశం డిసెంబర్ 3వ తేదీ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ నాలుగో తేదీన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని తెలిపారు. కొత్త సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుందని తెలిపారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపుపై ధీమాతోనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడంపై ఇది అత్యాశ లేక అతి నమ్మకమా? అని రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇన్ని రోజులు సచివాలయం వైపు కూడా చూడని కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు రాకముందే సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయడమేంటని సెటైర్లు వేస్తున్నారు.అసలు మూడవతేదీన ఫలితాలు చూశాక కేబినెట్ భేటీ ఏర్పాటుచేస్తే బాగుండేదని అంటున్నారు.
మరోవైపు.. ఈరోజు(శుక్రవారం) ప్రగతిభవన్‌లో కేసీఆర్.. బీఆర్‌ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని వారితో చెప్పినట్టు సమాచారం. ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. దీంతో, రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది.అయితే ఫలితాలు వెల్లడి కాకముందే కేసీఆర్ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గెలుస్తామని విశ్వాసమా.. లేదా ఓడిపోతామని అపనమ్మకంతో ఆయన ఈ మీటింగ్ పెడుతున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అసలు కేబినెట్‌లో ఉన్న మంత్రులు ఈ ఎన్నికల్లో గెలుస్తారా అని ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు టెన్షన్ పడుతుంటే కేసీఆర్ కేబినెట్ మీటింగ్ ఎలా పెడతారని పలువురు నోరెళ్లబెడుతున్నారుపోలింగ్ ముగిసిన వెంటనే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎక్కువ శాతం బీఆర్ఎస్‌కు ప్రతికూలంగా ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. అయినా బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు భిన్నంగా అసలు ఫలితాలు ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. హంగ్ వస్తే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మనమే మరోసారి రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నామని కేసీఆర్ అన్నారు. ఎందుకు పరేషాన్ అవుతున్నారని.. రెండు రోజులు నిమ్మలంగా ఉండాలని కేసీఆర్ తమ పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. 3వ తేదీన అందరం కలిసి సంబరాలు చేసుకుందామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తాము హ్యాట్రిక్ కొట్టబోతున్నామని పార్టీ శ్రేణులకు సమాచారం ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ బుల్‌షిట్ అని.. గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పు అయ్యాయని.. తమకు ఎగ్జిట్ పోల్స్‌తో పనిలేదని.. ఎగ్జాట్ పోల్స్ తమకు అనుకూలంగా వస్తాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు..