ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడం సంచలనం కలిగిస్తోంది. ఎఫ్ఐఆర్ లేదు.. నోటీసు లేదు.. ఏదో జరిగిందని కేసులు పెడుతున్నారు.. స్కిల్స్ స్కామ్ కేసులో నా పేరు ఎక్కడ ఉందో చూపించండి.. ప్రాథమిక ఆధారాలు లేకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని చంద్రబాబు ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు ఏపీలో సంచలనంగా మారింది. కొంతకాలంగా ఈ స్కామ్ పై విచారణ జరుగుతుండగా… తాజాగా చంద్రబాబును అరెస్ట్ చేసింది సీఐడీ.ఇప్పటికే ఈ కుంభకోణం పై ఈడీ కూడా విచారణ జరుపుతుండగా… పలువురు అరెస్ట్ అయ్యారు.ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్ మెంట్లు జరిగాయి. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబుపై 120(బి),166,167, 418, 420, 465, 468, 201,109, రెడ్ విత్ 34 మరియు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
షెల్ కంపెనీల ద్వారా రూ 241 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా చంద్రబాబును అరెస్ట్ చేయడంతో రాజకీయ ప్రకంపనలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, ఇవ్వకపోయినా..దర్యాప్తు చెల్లుబాటు కాదన్నారు CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు. అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసేందుకు..గవర్నర్ అనుమతి తప్పనిసరి ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపేనన్న పవన్.. అరెస్టుని ఖండించారు. ఇటు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. రేపు వివాహ వార్షికోత్సవం కావడంతో ఆమె అమ్మవారిని దర్శించుకుని నా భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నా అన్నారు భువనేశ్వరి. చంద్రబాబు అరెస్ట్ పైన టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఇటు భువనేశ్వరి సోదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది.సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్సప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం సమర్ధనీయం కాదు. బిజెపి దీనిని ఖండిస్తుందన్నారు. మరోవైపు ఇది అక్రమ అరెస్ట్ కాదు.. అనివార్యమయిన అరెస్ట్ .. అన్ని విషయాలు నిర్ధారించుకున్నాకే చంద్రబాబు అరెస్ట్ జరిగింది.. చంద్రబాబు అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు మంత్రి అంబటి రాంబాబు.