టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఆదేశాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి గెలుపు అవకాశాలు ఉండడంతో రేవంత్ కి భద్రత పెంచాలని నివేదిక పంపినట్టు తెలుస్తోంది. రేవంత్ ఇంటి దగ్గర పోలీసుల భద్రతను పెంచారు. ఆయన ఇంటి దగ్గరకు ఎవరు వస్తున్నారు.. ఎవరు వెళుతున్నారు అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఎంపీకి గతంలో 2 ప్లస్ 2 భద్రత ఉంటుంది. కానీ ఇప్పుడు రేవంత్ ఇంటి వద్ద పరిస్థితిని పోలీసులు సమీక్షిస్తున్నారు. పార్టీ నేతలు, అభిమానులు రేవంత్ ని కలవడానికి వస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రతను పెంచారని తెలుస్తోంది. ఎన్నికల కౌంటింగ్ కి మరో రెండు రోజులు మాత్రమే గడువు వుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని నివేదికలు పేర్కొన్నాయి. తాము మరోసారి అధికారంలోకి వస్తున్నామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.