ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే, అధికార పార్టీ , ప్రతిపక్షాలు వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నాయి.. ఇక, అధికార పార్టీ మరింత దూకుడు పెంచేసింది.. సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తున్నారు.. విజయవాడలోని మూడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ రోజు ప్రకటించారు వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
విజయవాడ పాతబస్తీ పంజాసెంటర్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. సీసీ రోడ్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. 2024 ఎన్నికల్లో వెలంపల్లి శ్రీనివాస్‌ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిపించాలని పిలుపునిచ్చారు.. గతంలో ఈయన దేవాదాయ శాఖమంత్రిగా పనిచేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణులను కూడా గెలిపించాలని పిలుపునిస్తూనే.. ఆ ముగ్గురు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరోవైపు గన్నవరం రాజకీయాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి రేపుతున్నాయి. మరోవైపు యార్లగడ్డ ఎపిసోడ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయవాడలోని కేబీఎన్కళాశాలలో నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడిన మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు ఎటు వెళ్లాలన్నది అతని ఇష్టం.. ఒకరికి ఎమ్మెల్యే సీటు ఇచ్చిన చోట మరొకరికి సర్దుబాటు చేస్తాం అన్నారు. కానీ, ఇక కాదనుకుంటే వారి ఇష్టం.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరి నిర్ణయాలు వారివి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
అయితే, గన్నవరం రాజకీయాల్లోనే కొనసాగుతాను అంటున్నారు వైఎస్సార్సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే కచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరంలో అనుచరులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గన్నవరం సీటు మళ్లీ ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరుతానని.. రెండేళ్లుగా సీఎం అపాయింట్మెంట్అడుగుతున్నా దొరకలేదన్నారు. తాము లేఖ రాసినా, స్పందన లేదని.. ఎలాంటి పరిణామాలు జరిగినా గన్నవరం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నానిని తేల్చిచెప్పారు. దీంతో, గన్నవరంలో ఏం జరుగుతుందనే చర్చ హాట్‌టాపిక్‌గా మారిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్.. ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఈ సారి వైసీపీ టికెట్.. వల్లభనేనికే ఫైనల్అయ్యే అవకాశం ఉందంటున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో యార్లగడ్డ టీడీపీ వైపు చూస్తున్నారని.. త్వరలోనే సైకిల్ఎక్కుతారనే ప్రచారం సాగుతోన్న తరుణంలో.. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మరి యార్లగడ్డ ఫ్యాన్ పార్టీని వీడి సైకిల్ పార్టీలోకి జంప్ అవుతారా? చూడాలి మరి.