HomeNewsబీజేపీ ఆహ్వానం.. తొలిరోజే 182 దరఖాస్తులు

బీజేపీ ఆహ్వానం.. తొలిరోజే 182 దరఖాస్తులు

Published on

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు వేడి రాజుకుంటూనే ఉంది. ఒకవైపు 115 మంది అభ్యర్దులతో కేసీఆర్ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్ కూడా దరఖాస్తుల్ని ఆహ్వానిస్తే 119 నియోజకవర్గాలకు వెయ్యిమందికి పైగా ఔత్సాహికులు దరఖాస్తులు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి టీ బీజేపీ దరఖాస్తులు ఆహ్వానించడంతో అనూహ్య స్పందన లభించింది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా..తొలి రోజు భారీగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అందాయి. సోమవారం తొలి రోజు 182 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు.

అభ్యర్థులు కార్యాలయానికి చేరుకుని దరఖాస్తు ఫారంను నింపుతున్నారు. దీంతో బీజేపీ ఆఫీస్ సందడిగా మారింది.ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో బీజేపీ టికెట్ కోసం అన్ని నియోజకర్గాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. బీజేపీకి కాస్త పట్టు ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం బలమైన అభ్యర్థులకు బీజేపీ టికెట్ కేటాయించనుంది. రాష్ట్రం, కేంద్ర అధిష్టానం స్థాయిలో స్క్రూటినీ నిర్వహించిన తర్వాత ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో చివరికి వరకు టికెట్ ఎవరికి వస్తుందనేది ఊహించడం కష్టంగా మారింది.

సికింద్రాబాద్ నుంచి తొలి దరఖాస్తు వచ్చిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. తొలి దరఖాస్తు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చింది. సికింద్రాబాద్ టికెట్ కోసం రవిప్రసాద్ గౌడ్ దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత జనగామ టికెట్ కోసం జగదీశ్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు సమర్పించారు. అయితే దరఖాస్తులు ఎవరెవరు పెట్టుకున్నారో మీడియాకు లీక్ చేయవద్దని అధిష్టానం ఆదేశించింది. మీడియాతో ఆచితూచి మాట్లాడాలని టికెట్టు తనకే వస్తుందని ఎవరూ ప్రకటించవద్దని, టికెట్ కేటాయింపు అధిష్టానం చేతిలో ఉంటుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.

Latest articles

More like this