తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎన్ని సీట్లలో పోటీచేస్తుంది… ఎక్కడినించి పోటీచేస్తుంది? ఎవరెవరు పోటీచేయబోతున్నారు? అనేది చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు తెరతీసింది. ఇప్పటివరకు పోటీకి సిద్ధం అంటూ 250 మంది దరఖాస్తు చేసుకోగా ఆజాబితాను రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు పరిశీలనకు వెళ్లింది.ఈ జాబితాను వడబోసి తొలిజాబితాగా 36 మంది అభ్యర్థులతో ఒక జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసానికి సూచించినట్లు సమాచారం. ఈ తొలిజాబితాలో ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటుగా సికింద్రాబాద్, కూకట్ పల్లి నియోజకవర్గాలున్నట్లు సమాచారం.రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీలపై సంక్షిప్తంగా మేనిఫెస్టో లో పొందుపర్చి అభ్యర్థుల తొలిజాబితాతో పాటుగా విడుదల చేసేందుకు పార్టీ నాయకత్వం యోచిస్తోంది.ప్రస్తుతం కూకట్ పల్లి నుంచి నందమూరి అలేఖ్య రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయనున్నట్లు పక్కా సమాచారం.గోషామహల్ నుంచి అరనింద్ కుమార్ గౌడ్ ను పోటీలోకి పార్టీ దించనున్నారని వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీమాంధ్రుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో టీడీపీ పోటీచేయాలని నిర్ణయించడం, నందమూరి కుటుంబం నుంచి ఒకరిని పోటీలో నిలపాలని భావిస్తున్నారు.కూకట్ పల్లిలో సీమాంధ్ర ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నలభై సీట్లలో సీమాంధ్ర ఓటర్లు పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని తేలింది.చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ నేతల వైఖరిపై సీమాంధ్ర ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు.చంద్రబాబు అరెస్టు పై హైదరాబాద్ లో ధర్నాలు చేయడం ఏంటని మంత్రి కేటీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్లు తెలంగాణలో సంచలనం రేపాయి. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుపై ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో మాట్లాడవద్దనడం ఏంటని విమర్శలు వచ్చాయి. కొంతమంది బీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా ఈ అరెస్టుని ఖండించారు. అనంతరం కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకున్నారు. తన తండ్రికి ఎన్టీఆర్ అంటే అభిమానమని, తన పేరు కూడా తారకరామారావు అని చెప్పుకొచ్చారు. ఖమ్మం పర్యటనలో ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇటు చంద్రబాబు అరెస్టుపై మెట్రో రైలులో కూడా శాంతియుత నిరసన చేస్తే అందుకు బీఆర్ఎస్ నేతలు అంతగా స్పందించలేదు. గతంలో టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరిన కూకట్ పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంతగా స్పందించలేదు. టీడీపీ అధినేత పట్ల కనీసం సానుభూతి లేకపోవడంతో టీడీపీ సానుభూతి పరులు ఆగ్రహంతో ఉన్నారు.
మాధవరం టార్గెట్ గా నందమూరి వంశం నుంచి ఒకరిని నిలబెడితే బాగుంటుందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దివంగత నటుడు నందమూరి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి పేరు తెరమీదకు వస్తోంది. నందమూరి వంశంలో నందమూరి మోహన కృష్ణ తనయుడు తారకరత్న.నందమూరి కుటుంబం నుంచి బాలయ్య..జూనియర్ ఎన్టీఆర్. కళ్యాణ్ రామ్ కూడా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సొంతం చేసుకున్నాడు. అయితే మరో హీరో కూడా నందమూరి కుటుంబం నుంచి వచ్చాడు. ఆయనే తారకరత్న. సినిమాల్లో నటిస్తున్న తారక రత్నకు చెప్పుకోదగిన విజయం లభించలేదు. తారక రత్న అలేఖ్య రెడ్డిని 2012 ఆగష్టు 2న ప్రేమ వివాహాం చేసుకున్నాడు. ఇటీవల లోకేష్ పాదయాత్ర సందర్భంగా గుండెపోటుకి గురై అనంతరం తారకరత్న చికిత్స పొందుతూ కన్నుమూశారు. తారకరత్న తర్వాత ఆయన భార్య అలేఖ్యరెడ్డి చంద్రబాబు అరెస్టు తర్వాత కుటుంబానికి సంఘీభావంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నారు. కూకట్ పల్లిలో గతంలో నందమూరి సుహాసిని మహాకూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున బరిలో నిలిచారు. తాజాగా అదే కుటుంబానికి చెందిన అలేఖ్యరెడ్డిని బరిలో దించితే వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన మాధవరం కృష్ణారావుకి లక్షా 11 వేల 612 ఓట్లు వచ్చాయి. 52శాతం ఓట్లు లభించగా ఆయనకు 41వేల 49 ఓట్లు వచ్చాయి. మహాకూటమి అభ్యర్థి నందమూరి వెంకట సుహాసినికి 70 వేల 563 ఓట్లు పోలయ్యాయి. ఆమెకు 33 శాతం ఓట్లు వచ్చాయి. ఆమె తరఫున చంద్రబాబు, బాలయ్య ఇతర కీలక నేతలు ప్రచారం చేశారు. తాజాగా కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలిపితే బీఆర్ఎస్ విజయావకాశాలు భారీగా దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.