తెలంగాణ ఎన్నికల వేళ ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అదిరిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీ.బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రధాని మోడీతో పాటు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలతో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. కానీ, అవన్నీ నినాదాలకే పరిమితం అయ్యాయి కానీ, ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని.. ఐదేళ్ల పాటు ఎన్నికలే ధ్యేయంగా ఉండొద్దని నాయకులకు సూచనలు చేశారు. ఎన్నికలే ధ్యేయంగా మోడీ పనిచేస్తే 317 ఆర్టికల్, మహిళా రిజర్వేషన్ బిల్లు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామ మందిరం నిర్మితమయ్యేదా? అని గుర్తుచేశారు.
దేశ అభివృద్ధికి అంతర్గత భద్రత చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మన దేశంపై దాడి చేస్తే తిరిగి దాడి చేయగలమని మోడీ నిరూపించారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే నాకు మోడీ అంటే అభిమానమని చెప్పారు. దేశానికి బలమైన నాయకుడు అవసరమని నాలాగే ప్రతి ఒక్కరూ అనుకున్నారు. అందుకే మోడీ ప్రధాని అయ్యారని అన్నారు. వారిని ముఖ్యమంత్రి చేస్తాం.. వీరిని ముఖ్యమంత్రి చేస్తామని నోటితో ఇష్టానుసారం మాట్లాడలేదని పరోక్షంగా కేసీఆర్పై విమర్శలు చేశారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన బీజేపీకి జనసేన నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ‘ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్’ దీనికోసం మనస్ఫూర్తిగా శాయశక్తులా కష్టపడుతా అని అన్నారు. కలిసి పోటీ చేసే అవకాశం ఇచ్చిన తెలంగాణ బీజేపీకి కృతజ్ఞతలు చెప్పారు.