ఉన్నత విద్యకోసం ఏటా వేలాదిమంది తెలుగు రాష్ట్రాల విద్యార్ధులు అమెరికా వెళుతుంటారు. అక్కడే చదువుకుంటూ..ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. అదే మన విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. 21 మంది భారతీయ విద్యార్థులకు అమెరికాలో ఊహించని పరిణామం ఎదురైంది. అక్కడ యూనివర్శటీల్లో కోర్సుల్లో చేరేందుకు వెళ్లగా.. ఎయిర్‌పోర్టులలో తనిఖీలు నిర్వహించారు. వారిలో కొంతమందిపై అనుమానంతో అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు ఆరా తీశారు. యూనివర్శిటీల్లో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. వీసా సమయంలో చెప్పినదానికి, వాస్తవంగా కనిపించేదానికి పొంతన కుదరకపోవడంతో అధికారులు వారిని తిప్పి పంపుతున్నారు.
మొబైల్స్, మెయిల్స్, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో ఫోన్ కాల్స్ రికార్డును పరిశీలించిన అధికారులు వారిని తిప్పి పంపారు. ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్ అయిన విద్యార్థులు తిరిగి 5 ఏళ్ల దాకా ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విద్యార్ధులను అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రిటర్న్ ఫ్లైట్‌లు ఎక్కించారు. కొన్ని డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడంతో పాటుగా ఇతర కారణాలతో వీరిని వెనక్కు పంపించారు. వీరిలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా వెళితే ఇలా వెనక్కు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. వీరిలో ఏపీ విద్యార్ధులు కూడా ఉండటంతో సీఎం జగన్ ఆరా తీశారు. వారికి తగిన సాయం అందించాలని అధికారులకు సూచించారు.