ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. మనం చందమామపై కాలు పెట్టాం. మామ జాడను కనిపెట్టే పనిలో సక్సెస్ అయ్యాం. చందమామపై భారత్ చెరగని ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్‌గా ల్యాండింగ్ అయింది.
చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని తాకింది. దీంతో దేశమంతా సంబరాలు అంబరాన్నంటాయి. జనమంతా సైంటిస్లులకు అభినందనలు చెబుతున్నారు. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది.