తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. భారతీయ జనతా పార్టీకి మాజీ ఎంపీ విజయశాంతి రాజీనామా చేశారు. అమె తన ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోతున్నదీ ఆమె వెల్లడించలేదు. ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నెల 17న తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్న సందర్భంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే విజయశాంతి తమ పార్టీలో చేరతారన్న విషయాన్ని మల్లు రవి ఇంతకుముందే లీక్ చేసిన సంగతి తెలిసిందే.
విజయశాంతి రాజీనామా చేయడానికి కారణం జనసేనతో పొత్తు పెట్టుకోవడం కారణమేనని చెబుతున్నారు. జనసేనతో పొత్తు ఆమెకు ఇష్టం లేదని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎన్డీఏలోకి ఆహ్వానించిన నాటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మోదీ సభలకు కూడా హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఆమె చేసిన ట్వీట్ కూడా అలాగే ఉంది. తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు అని ట్వీట్ చేశారంటే అది జనసేన గురించి అని చర్చించుకుంటున్నారు. తెలంగాణ సెటిలర్స్ అనే భావన ఎవరికీ లేదని, ఇక్కడ ఉనన వారంతా తెలంగాణ ప్రజలేనని ఆమె ట్వీట్ చేశారు.
తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని విజయశాంతి దాదాపు ఏడాది కాలంగా అసంతృప్తితో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పక్కనబెట్టారని, ఆ తర్వాత సమావేశాలకు కూడా పిలవడం మానేశారని అసహనం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల బీజేపీ వేసిన ఎన్నికల కమిటీల్లో ఆమెకు ఆందోళనల కమిటీ బాధ్యతలు అప్పగించారు. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. దీంతో పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. పలు సందర్భాల్లో పార్టీ మార్పు విషయంపై ఎలాంటి ఆలోచన లేదని ఆమె చెబుతూ వచ్చినప్పటికీ.. రాష్ట్ర పార్టీలో నేతల మధ్య అంతర్గత విబేధాల నేపథ్యంలో ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా ఆమె రాష్ట్ర పార్టీ అధిష్టానం తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తనపట్ల పార్టీ పెద్దలు అవలంభిస్తున్న వైఖరిపైనా అసంతృప్తితో ఉన్న ఆమె.. పార్టీ కార్యక్రమాల్లోనూ కొద్దికాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీని వీడుతున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినప్పటి నుంచి విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదని ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వేదికపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ ద్రోహులతో కలిసి వేదికను పంచుకోలేకనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు విజయశాంతి అప్పట్లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనికితోడు పలు సందర్భాల్లో బీజేపీ అధిష్టానం వ్యవహారశైలిని ఆమె తప్పుపడుతూ ట్వీట్లు చేశారు. బీజేపీ అధిష్టానం ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. జరిగిన తప్పును గుర్తించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్టార్ క్యాంపెయినర్ గా ఎమ్మెల్యే రఘునందన్ తో పాటు విజయశాంతిని నియమిస్తున్నట్లు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయినా ఆమె సంతృప్తి చెందలేదు. మోదీ బహిరంగ సభ తరువాత విజయశాంతి ట్విటర్, ఫేస్ బుక్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ మార్చడంతో బీజేపీని వీడటం ఖాయమన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రచారాన్ని నిజంచేస్తూ బుధవారం ఆమె బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేయగా.. తాజాగా విజయశాంతికూడా ఆ పార్టీకి రాజీనామా చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్నికలు 15 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో విజయశాంతి నిర్ణయం అధిష్టానానికి తలనొప్పిగా మారింది.