స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు మాజీ సీఎం చంద్రబాబునాయుడు. మరోవైపు లండన్ పర్యటన తర్వాత సీఎం జగన్ రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఇవాళ సమావేశం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రానున్న అసెంబ్లీ సమావేశాలతోపాటు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. సెప్టెంబర్ 21 నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వం అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.
టార్గెట్ చంద్రబాబు?
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ 23 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ అధినేత అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు మరో 48 గంటల్లో వచ్చే అవకాశం ఉంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలిసారి కేబినెట్ భేటి కానుండడం. సెప్టెంబర్ 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు అరెస్ట్‌ని ప్రస్తావించాలని.. ఆయన జైలుకు ఎందుకు వెళ్లారన్న విషయాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకొని వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఉద్యోగులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ అసెంబ్లీలో ప్రధానంగా హైలెట్ చేసే అవకాశం ఉంది. వారి సమస్యలకు ఈ అసెంబ్లీలోనే ఫుల్స్టాప్ పెట్టాలని జగన్ సర్కార్ అడుగులు వేస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటివలి ఏపీ ప్రభుత్వం రూపొందించిన ప్రతిపాదనపై ఉద్యోగులు ఇటీవల భేటీలో కొన్ని మార్పులను కోరారు. సీఎం నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ ఉపసంఘం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మరోసారి భేటీ అయి వీటిని ఖరారు చేయాల్సి ఉంది.