మనలో చాలామంది వివిధ రకాల జుట్టు సమస్యలకు గురవుతుంటారు. అందులో ముఖ్యమయింది పేలు. మన తలలో పేలు ఎలా వస్తాయి? పేనుకొరుకుడు వస్తే జుట్టు ఊడిపోతుందని అంతా భావిస్తారు. తలలో పేల సమస్య ఎదుర్కోని వారు బహుశా ఎవరూ ఉండరని చెప్పవచ్చు. పేల గురించి వినగానే.. మనలో చాలామందికి తల మీద చిటచిట లాడినట్టు ఉంటుంది. పేలు మరీ ఎక్కువగా ఉంటే.. జుట్టు పీకేస్తే బాగుండన్నంత చిరాకు పుట్టుకొస్తుంటుంది. ఇంతగా ఇబ్బంది పెట్టే పేలు ఎలా పుడతాయి? ఎలా వ్యాప్తిస్తాయో మీకు తెలుసా?
గుడ్ల నుంచి పేలు పుడతాయి.ఈ గుడ్లను నిట్ అంటారు. మనిషి రక్తమే పేలకు ఆహారం. అవి మన తల మీద జుట్టు మధ్యలో తిరుగుతూ రక్తాన్ని పీల్చుతాయి.తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి పేలు వ్యాపిస్తుంటాయి.చిన్న పిల్లలను చాలామంది దగ్గరకు తీసుకుని ఆడిస్తుంటారు. ఎత్తుకుంటారు. అలాంటప్పుడు వారి తలలు ఎక్కువ మందికి తాకే అవకాశం ఉంటుంది. అందుకే, పెద్దలతో పోల్చితే పిల్లలకు పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. స్కూళ్ళలో ఈ పేల సమస్య ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ మందితో కలిసి ఉండటం వల్ల కూడా పేల సమస్య పెరుగుతుంది. పొడవాటి జుట్టు ఉండటం కూడా పేలు వ్యాప్తి చెందడానికి మరో కారణం.అయితే సెల్ ఫోన్ల ద్వారా పేలు వ్యాప్తి చెందుతాయని కొందరు అంటారు. కానీ, నిజానికి ఫోన్ల ద్వారా పేలు వ్యాపించవు. టీనేజీ పిల్లల్లో పేల సమస్యకు, స్మార్ట్ఫోన్ వినియోగానికి సంబంధముందని చర్మ నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే, యువతీ యువకులు ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేటప్పుడు, సరదాగా వీడియోలు, ఫొటోలు చూసేటప్పుడు ఒకే ఫోన్ ముందు తలలు దగ్గరగా పెట్టి చూస్తుంటారు. అప్పుడు ఒకరి జుట్టు మరికొరి జుట్టుకు తాకడం ద్వారా పేలు ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తాయి.తల్లో పేలు ఎగరలేవు, దూకలేవు. కొత్త వ్యక్తి జుట్టు తాకగానే.. ఆ వెంట్రుకలను పాకుతూ వెళ్లిపోతాయి. తల మీదకు చేరి అవి గుడ్లు పెడతాయి.ఆ గుడ్లు పిల్లలుగా మారతాయి. తలలోనే ఉండిపోతాయి. మీ తలలో పేలున్నాయని మీకు తెలిసేలోపే అవి ఇతరులకూ వ్యాపిస్తాయి. పేలు వచ్చాక వెంటనే తెలియదు. కొన్ని రోజుల తర్వాత అలర్జీ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఆ ఎలర్జీ, లేదా చుండ్రులాంటి సమస్యలు కరోనా వైరస్ లా ఇతరుల తలలోకి వ్యాపిస్తాయి. కొంతమందికి ఈ పేల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారు గుండు చేయించుకుంటూ ఉంటారు. కొందరు గుండు చేయించుకున్నాక కూడా పేల సమస్య వేధిస్తుంది. అంతేకాకుండా మరో విచిత్రం ఏంటంటే పిల్లులు, కుక్కలు ఇతర జంతువుల తలపై పేలు పెరగవు. మనిషి నుంచి మనిషికే వ్యాపిస్తాయి. జంతువుల మీద అవి సంతోషంగా బతకలేవంటారు డెర్మటాలజీ నిపుణులు. ల సమస్య తీవ్రంగా ఉంటే, వైద్యులను సంప్రదించాలి. తరచూ తలస్నానం చేసి శుభ్రంగా దువ్వుకోవాలి. మార్కెట్లో దొరికే పేల నివారణ మందులు పరిశీలించి వాడడం మంచిది.