మల్లన్న భక్తులకు తప్పనున్న తిప్పలు
Komuravelli Mallanna Temple Problems: ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, టాయిలెట్ సౌకర్యం, కూర్చోవడానికి బెంచీలు, ఫ్యాన్లు లేకపోవడంలో గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు

Komuravelli Mallanna Temple Problems: భక్తుల కోరిన కోర్కెలు తీర్చే సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తులకు త్వరలోనే తిప్పులు తప్పనున్నాయి. ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురు చూస్తున్న క్యూ కాంప్లెక్స్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. స్వామి వారి బ్రహ్మోత్సవాల నాటికి క్యూ కాంప్లెక్స్ ప్రారంభించేందుకు ఆలయ అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు.
స్వామి వారిని ప్రతీ ఏటా సుమారు కోటి మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలోనే సుమారు యాభై లక్షల మంది స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, టాయిలెట్ సౌకర్యం, కూర్చోవడానికి బెంచీలు, ఫ్యాన్లు లేకపోవడంలో గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తుల ఇబ్బందులను గుర్తించిన అధికారులు 3 ఏడేళ్ల క్రితం రూ.12 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ప్రస్తుతం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇంకో నెల రోజుల్లో పనులు పూర్తి చేసి దేవస్థానానికి అందిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. నూతనంగా నిర్మాణం చేస్తున్న క్యూ కాంప్లెక్స్‌ల్లో భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఇబ్బందులు తొలగనుండడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



