ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలె సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర గందరగోళం నెలకొంది. నిన్న రాత్రి బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల జనం అత్యుత్సాహం చూపించారు. స్టూడియో నుంచి బయటికొచ్చే కార్లపై దాడికి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్ దీప్ కారు అద్దాలను ధ్వంసం చేశారు. కాసేపటికి బయటికొచ్చిన ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు.బిగ్ బాస్ విజేత ప్రకటన తర్వాత రోడ్డుపై ఈ బీభత్సం జరిగింది. అంతకుముందు అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. డ్రైవర్ గాయపడ్డారు. కొంత మంది యువకులు మద్యం మత్తులో నానా హంగామా చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. దీనిపై అశ్విని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తన కారు అద్దాలు పగిలిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఇంత దారుణంగా అద్దాలు పగలకొడితే ఏం చేయాలంటూ అశ్విని ఎమోషనల్ అయ్యింది. ఫ్యాన్స్ ప్రవర్తించిన తీరు చాలా గలీజ్‌గా ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచిన సెలబ్రేషన్స్‌లో ఉండగా.. హౌస్ బయట ఈ ఘటన జరగడంతో గందరగోళం ఏర్పడింది.
ఫినాలే కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అన్నపూర్ణా స్టూడియోస్‌కు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ విజేత అని తెలియగానే ఆనందంతో అతడి ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే అక్కడే ఉన్న అమర్దీప్ ఫ్యాన్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఇరు వర్గాల ఫ్యాన్స్ తోపులాటకు దిగారు. అసభ్యపదజాలంతో తిట్టుకున్నారు. పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న కొండాపూర్-సికింద్రాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు, ఓ కారు అద్దాలను పగులకొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.