దుర్గమ్మకు పట్టువస్త్రాలు.. ఏర్పాట్లపై సీఎం ఖుషి
CM Chandrababu Visits Durgamma Temple : మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు సీఎం చంద్రబాబు సతీసమేతంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శించుకున్నారు

CM Chandrababu Visits Durgamma Temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ.. సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అర్ధరాత్రి నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఆలయ అధికారులు. అర్థరాత్రి నుంచి సరస్వతీ అవతారంలో భక్తులకు దుర్గమ్మ అభయం ఇస్తున్నారు. మరోవైపు చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం పెద్ద ఎత్తున జరుగుతుంది.
మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మకు సీఎం చంద్రబాబు సతీసమేతంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులకు ఆలయ అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అంతకుముందు గర్భాలయంలో అమ్మవారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి ప్రతిమను ఆలయ అధికారులు సీఎం దంపతులకు బహుకరించారు.
ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. దుర్గ గుడిలో ఏర్పాట్లను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వర్షాలు సంవృద్ధిగా కురిసి .. ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులను ఎదుర్కొనే శక్తినివ్వాలని దుర్గమ్మను వేడుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.



