ఆసియా స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలం!

Stock Market: తుమ్మితే ఊడిపోయే ముక్కులా మారిపోయాయి ఆసియాలోని స్టాక్‌మార్కెట్లు. అమెరికా-ఇరాన్ యుద్ధంతో మార్కెట్లలో అలజడి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులోనే 600 బిలియన్ డాలర్ట సంపద హరించుకుపోయింది. ఆసియా మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దక్షిణకొరియా సూచీ కోస్పి 4శాతం పడిపోవటంతో 131 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. జపాన్ సూచీ నిక్కీ 2.6శాతం పడిపోవటంతో జరిగిన నష్టం 195 బిలియన్ డాలర్లపైనే. ఇక చైనాలోని షాంఘై సూచీ 1.5శాతం, షెన్‌జెన్ సూచీ 2.6 శాతం క్షీణించాయి.
తైవాన్ స్టాక్ మార్కెట్ 2.3 శాతం కిందికి జారిపోతే.. హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ సూచీ 3శాతానికి పైగానే పడిపోయింది. సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్ల పతనం భారత్ స్టాక్‌మార్కెట్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలతో భారత్ మార్కెట్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. బుల్ రంకెలేస్తుందనుకుంటే క్లోజింగ్ టైమ్‌కి మార్కెట్ ‘బేర్’మంటోంది.
సెన్సెక్స్, నిఫ్టీ సూచీలతో పాటు ఐటీ, టెక్నాలజీ, దిగుమతులపై ఆధారపడే రంగాల షేర్లు రికార్డుస్థాయి కనిష్టాలకు జారిపోతున్నాయి. భారత్ ముడిచమురు అవసరాల్లో ఎక్కువభాగం దిగుమతులపైనే ఆధారపడింది. దీంతో పెరుగుతున్న చమురుధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ఆసియా మార్కెట్లలో అమ్మకాల జోరు కొనసాగుతోంది. మిడ్, స్మాల్ క్యాప్స్ స్టాక్స్‌లో ప్రతిరోజూ అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.



