ఏపీలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. మళ్లీ నామినేషన్లు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం నామినేషన్ల గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. కాగా, వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై అక్టోబర్ 27న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది

AP Election Commission : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలు గడువును మరో 48 గంటల పాటు పొడిగించింది. దీంతో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభ్యర్థులు మళ్లీ నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం ప్రకారం కడప మున్సిపల్ కార్పొరేషన్లో 11 వార్డులు, రాజంపేట మున్సిపాలిటీలో 11 వార్డులు, మైదుకూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో 18 వార్డులకు నామినేషన్ల గడువు పొడిగింపు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.
అక్టోబర్ 23, 24 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ
సవరించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 23, 24 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సంబంధిత ఎన్నికల అధికారులు, కలెక్టరేట్లలో ఈ ప్రక్రియ కొనసాగనుంది. కొత్తగా దాఖలైన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ అక్టోబర్ 25న పూర్తికానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 100 స్థానిక సంస్థలకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేయనున్నారు. నవంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో గడువు పొడిగింపు
నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా నామినేషన్ల వ్యవహారంపై 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం నామినేషన్ల గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. కాగా, వైసీపీ దాఖలు చేసిన పిటిషన్పై అక్టోబర్ 27న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.



