HomeNewsAndhra Pradeshవైఎస్ భాస్కర్ రెడ్డి కి బెయిల్.. కండిషన్స్ అప్లై

వైఎస్ భాస్కర్ రెడ్డి కి బెయిల్.. కండిషన్స్ అప్లై

Published on

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. వైఎస్ భాస్కర్ రెడ్డి జైలులో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా వైఎస్ భాస్కర్ రెడ్డి అనారోగ్యంపై సీబీఐ కోర్టు చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ వివరణ కోరింది. భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నది వాస్తవమేనని తెలిపారు. ఈ మేరకు నివేదిక అందజేశారు. జైలు సూపరింటెండెంట్ నివేదికను పరిగణలోకి తీసుకున్న సీబీఐ జడ్జి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ 12 రోజులు వైద్య చికిత్స చేయించుకోవాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.

ఎస్కార్ట్ బెయిల్‌పై విడుదలైన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ కోర్టు పలు షరతులు విధించింది. బెయిల్ సమయంలో హైదరాబాద్‌ను విడిచి పెట్టి వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు హైదరాబాద్‌లోనే చికిత్స పొందాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 3న చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండ్ అవ్వాలని వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ కోర్టు బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం విడుదలైన వెంటనే చికిత్స కోసం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ విచారణకు ఏ-8 నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డితోపాటు మిగిలిన నిందితులు సైతం హాజరయ్యారు. తదుపరి విచారణను అక్టోబర్ 4కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఎస్కార్ట్ బెయిల్ కింద 12 రోజుల పాటు ముగ్గురు పోలీసులు వైఎస్ భాస్కర్ రెడ్డి వెంటే ఉంటారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు ఏప్రిల్‌ 16న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భాస్కర్ రెడ్డిపై 130బీ, రెడ్ విత్ 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించింది సీబీఐ కోర్టు. వయస్సు, ఆరోగ్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక కేటగిరీగా చూడాలని వైఎస్ భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనను ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా ఉంచేందుకు సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది.

Latest articles

More like this