కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. అధికార పార్టీ అభ్యర్ధుల్ని ప్రకటించి ఈ రేస్ లో ముందుండే… కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ రెడీ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఢిల్లీకి చేరిందని త్వరలో తొలి జాబితా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక దఫాలుగా చర్చలు జరిపిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో అభ్యర్థుల వడపోత సాగుతోందని తెలుస్తోంది. ఏఐసీసీ కార్యాలయంలో రెండురోజులపాటు సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. ఇదే చివరి భేటీ కాగా.. ఆ తర్వాతి బంతి హైకమాండ్ కోర్టుకు చేరుతుంది.
దీంతో.. టీ కాంగ్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితా ఆధారంగా.. స్క్రీనింగ్ కమిటీ తొలుత ఈనెల ఆరో తేదీన హైదరాబాదులో సమావేశమైంది. వరుసగా పీఈసీ సభ్యులను, డీసీసీ అధ్యక్షులను, మాజీ మంత్రుల అభిప్రాయాలు తీసుకుంది. ఇప్పుడు మరోమారు ఢిల్లీ భేటీ అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీలో ఛైర్మన్ మురళీధరన్ ,జిగ్నేష్ మేవాని, సిద్దిఖీ ,ఎక్స్ అఫిషియో సభ్యులు ఇంఛార్జి ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు.ఫస్ట్ లిస్ట్ లో 25 నుంచి 30 సీట్లలో అభ్యర్థుల ఖరారు చేయనుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇద్దరు ముగ్గురు అభ్యర్థులున్న చోట మరోసారి స్క్రీనింగ్ కమిటీ దృష్టి పెట్టనుంది. 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఫైనల్ స్టేజ్ కి వచ్చింది.
ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ ఉన్న నియోజకవర్గాలపై కాంగ్రెస్ ఈ భేటీల్లో ఫోకస్ చేసింది. అలాగే ఇద్దరు, ముగ్గురు పేర్లతో కూడిన నివేదిక ను సిద్ధం చేయబోతోంది. దీని ప్రకారం 70 నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉంటాయని అంటున్నారు. ఈ నియోజకవర్గాలను ఫైనల్ చేసి.. హై కమాండ్ ప్రకటించే అవకాశం ఉంది.