ఆయన నిత్యం ఏదో ఒక పోరాటంలో పాల్గొంటూనే ఉంటారు. సామాజిక బాధ్యతగా జనాన్ని వివిధ అంశాలపై చైతన్యవంతం చేస్తుంటారు. సేవా కార్యక్రమాలు రాష్ట్రమంతటా కొనసాగిస్తూ అలుపెరుగక శ్రమిస్తున్నారు .. ఆయనే చలసాని శ్రీనివాస్. ఏపీ రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారుండరు. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి నవ్యాంధ్రలో జరుగుతున్న తాజా పరిణామాలు ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. ఏ అంశం పైన అయినా విమర్శనాత్మకంగా పరిశీలించడం, తనదైన రీతిలో స్పందించడం ఆయన నైజం. విజయవాడ నగరంలో గత ఏప్రిల్ నెల నుంచి నిరంతరాయంగా 24 గంటలు చల్లటి మినరల్ వాటర్ అందించడమే కాక ప్రతిరోజు విజయ బ్రాండ్ మజ్జిగ అందిస్తున్నారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్.
ప్రతి శనివారం, ముఖ్యదినాల్లో అన్నదానం విజయవాడ నడిబొడ్డున వారి కుమార్తె శిరీష్మ జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ నిర్వహణ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తుంది హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థని, రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు ఈ 24×7 నిరంతరం చేసే కార్యక్రమం చాలా మందికి ఆదర్శం కావాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చలసాని శ్రీనివాస్ సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని మునుముందు కూడా కొనసాగిస్తున్నాను చెప్పటం చాలా మంచిదన్నారు. ప్రజా పోరాటాల్లోనే కాక సేవా కార్యక్రమాలలో కూడా శ్రీనివాస్ ఉండటం హర్షణీయమన్నారు. ఈ మధ్యకాలంలో హెల్పింగ్ హాండ్స్ పేరు బాగా వినబడుతోంది అన్నారు. విజయవాడ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ శ్రీనివాస్ గారి కుమార్తె విజయవాడలో పుట్టిన కారణంగా విజయవాడలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారని, గత ఏప్రిల్ నుంచి నిరంతరం 24 గంటలు చల్లటి మంచినీరు అలాగే చల్లటి మజ్జిగ, అన్నదానం ప్రతీరోజూ వందలాదిమందికి ఉపయోగపడుతున్న ఈ కేంద్రంలో నేడు హెల్త్ క్యాంప్ కూడా ప్రారంభించడంపై చలసాని శ్రీనివాస్ కి విజయవాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.
చలసాని శ్రీనివాస్ సేవల్ని కొనియాడిన ఎమ్మెల్యే గద్దె
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో దశాబ్దాలుగా ఉన్న శ్రీనివాస్ సేవా రంగంలో కూడా ఉండటం చాలా మందికి తెలియదన్నారు. గిరిజన గ్రామాల్లో చేసిన సేవా కార్యక్రమాల్లో వారి సహకారం కూడా ఉందని ఈ విషయంలో చలసాని శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నామని అన్నారు. శ్రీనివాస్ పోరాట పటిమ తెలుసుగాని చాలామందికి అనేకచోట్ల ఆయన సేవతత్పరత తెలియదని విజయవాడలో కూడా ఇంత భారీ ఖర్చు పెట్టి చేస్తున్నారని, అందరు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ చలసాని శ్రీనివాస్ దశాబ్దాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను, విశాఖపట్నం హుదుద్ దగ్గర నుంచి గోదావరి జిల్లాలో వరదలు వచ్చినా అలాగే కర్నూలు మహబూబ్ నగర్ లో ఉన్న చెంచు గ్రామాలు, ఖమ్మం తూర్పుగోదావరి జిల్లా అనేక గిరిజన గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అలాగే, క్లిష్టమయిన కోవిడ్ సమయంలో కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటగా N95 మాస్కులతో సహా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, కేంద్ర స్థానమైన విజయవాడలో కూడా కొన్ని నిర్వహించాలని ఆడిగామని దాంతో ఇక్కడ కూడా మొదలు పెడతాను అని చెప్పారని అన్నారు.
చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతవరకు ఎవరితో పంచుకోవాలని విషయాలు కూడా చెప్తున్నామని, మొన్ననే పాలకొల్లు అలాంటి చోట్ల ప్రభుత్వ హాస్పిటల్స్ లో మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టామని, ఎన్నో చేశామని కానీ ఎక్కడా లేనట్లు ఈ సేవా కేంద్రం నిర్వహణ సమయంలో రాష్ట్ర ప్రజలు నమ్మలేని విధంగా, అడ్డంకులు, బెదిరింపులు, హేళనలు ఎదుర్కొన్నామన్నారు.ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఈ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామని అన్నారు. తనకు ముఖ్యమైంది కులమత వైషమ్యాలు పెంచే రాజకీయ వ్యవస్థ కాదని మానవీయత, ఆంధ్ర తెలుగుజాతి వైపే ఉంటానని అన్నారు.
హెల్పింగ్ హాండ్స్ సంస్థ కో ఆర్డినేషన్ నిర్వహణ అద్భుతమని, వారికి ధన్యవాదాలు తెలిపారు.హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకుడు మరీదు శివరామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తాము రాష్ట్ర అధ్యక్షురాలు ఆరేపల్లి స్వాతి, నందు, కనకదుర్గ పర్వీన్, కొండమ్మ, సునీల్, స్వాతి, సురేష్, వెంకట్, చైతన్య, సుభాషిణి, సుబ్బారెడ్డి మొత్తం టీమ్ కృషి అని చెబుతూ ఇంతటి గొప్ప కార్యం నిర్వహించేందుకు కర్త, కర్మ, క్రియ శ్రీనివాస్ గారని ధన్యవాదాలు చెప్పారు.120రోజులు కష్టపడ్డ వాలంటీర్లు, శ్రీనివాస్ గారి సిబ్బందిని అతిధులు అభినందిస్తూ వారికి మెమెంటోలు బహుకరించారు. ఈ సమావేశంలో సమితి సహాయ కార్యదర్శి తాటికొండ నరసింహారావు, రామకృష్ణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు కృష్ణ ఆంజనేయులు, జనసేన నాయకులు సోమనాధం తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రఘురామ్ నేతృత్వంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి అనేకమందికి రక్తపరీక్షలు చేశారు. చలసాని శిరిష్మా సేవాకేంద్రంలో మిగిలిన మౌలిక వసతులు పూర్తికాగానే రెగ్యులర్ గా క్యాంప్ నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.