తెలంగాణలో ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందో చెప్పలేం. ఒక్క చిన్నవివాదం మెడకు చుట్టుకుంటుంది. అదే రాజకీయాల్లో చిన్న పొరపాటు చేసినా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. అంతా అనుకున్నదే జరిగింది.. మొదటి నుంచి జరిగిన ప్రచారమే నిజమైంది.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు చుక్కెదురైంది. ఈ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అభ్యర్ధుల ప్రకటన లిస్టులో రాజయ్యను పక్కన పెట్టి కడియం వైపు మొగ్గుచూపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ మేరకు ఆయన అభ్యర్థుల మొదటి జాబితాలో కడియం పేరును ప్రకటించారు. దీంతో ఏ దేవుడి దయతోనైనా చివరి నిమిషంలో టికెట్ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతోపాటు ఆయన అనుచరులకు షాక్ తగిలింది. దీంతో తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగారని సమాచారం.
రాజకీయాల్లో అవకాశాలు అనుకోకుండా వస్తాయి. కానీ వాటిని చక్కగా వినియోగించుకునే వారు ముందుకెళతారు. రాజయ్య అదే కోవకు చెందుతారు. 2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి కేసిఆర్ఫోన్చేసి రాజయ్య నీకు అవకాశం ఇస్తాను…అని చెప్పి మరీ రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేశారు. అలాగే కడియం శ్రీహరి విషయంలోనూ ఎవరూ ఊహించని నాయకత్వం ఆయనకు అందిస్తానని కూడా కేసిఆర్స్టేషన్ఘన్పూర్ప్రజలకు చెప్పారు. అది కాకతాలీయంగా జరిగినా ఇద్దరికీ అవకాశం అలా కలిసి వచ్చింది. కడియం శ్రీహరికి తన నాయకత్వ సమర్థతతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజయ్య చేజార్చుకున్నాడు.
మంత్రి వర్గం నుంచి తప్పించబడ్డారు. అది స్వయంకృతాపరాధం. అయినా ముఖ్యమంత్రి కేసిఆర్గత ఎన్నికల్లో మళ్లీ అవకాశం కల్పించారు. ప్రతిపక్షాలు రాజయ్యను అడ్డంపెట్టుకొని దిక్కుమాలిన రాజకీయాలు చేసి, అస్ధిర రాజకీయాలు సృష్టించే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని వారి ఎత్తులు, జిత్తులు చెల్లకుండా, వారి పాచికలు పారకుండా రాజయ్యకు అవకాశమిచ్చారు. రాజయ్య గెలుపు కష్టమే అనుకున్న చోట కడియం శ్రీహరితో సహా, నాయకులంతా కలిసి రాజయ్యను గెలిపించారు. కాని రాజయ్య చిలిపి పనులు తగ్గించుకోలేదు…ఆయన చేసే చేష్టలు ఆపుకోలేదు. ఇదే ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మైనస్. ఎంత ఎదిగితే అంత ఒదిగి వుండాలన్నది మర్చిపోయాడు…తాను ఏం చేసినా చెల్లుతుందనుకున్నారు. ప్రజా జీవితంలో వున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా వుండాలి. ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య వ్యవహారం రాజయ్య మెడకు చుట్టుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్నారని నవ్య ఆరోపించడం, దీనిపై మహిళా కమిషన్ విచారణ జరిపి వాస్తవం కాదని తేల్చింది. అయితే అప్పటికే నవ్య వ్యవహారం రాజయ్య ఇమేజ్ ని డామేజ్ చేసిందనే చెప్పాలి.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. రాజయ్య కాంగ్రెస్ పార్టీ లేదా బీఎస్పీలో చేరాలంటున్నట్టు రాజయ్య వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజయ్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా జానకీపురం సర్పంచ్ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం తాటికొండ రాజయ్య ఇమేజ్‌ని బాగా దెబ్బతీసింది. నవ్య ఎపిసోడ్రచ్చకెక్కడం, మీడియా, సోషల్ మీడియాలో ప్రచారంతో ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికెళ్లింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి ఈసారి స్టేషన్‌పూర్ టికెట్ ఇస్తే గెలిపించి చూపిస్తానని హామీ ఇవ్వడంతో బీఆర్ఎస్ అధిష్టానం కడియం వైపే మొగ్గుచూపింది. బీఆర్ఎస్ మొదటి జాబితాలో కడియం శ్రీహరి పేరు రావడమే ఇందుకు నిదర్శనం.
టికెట్ రాక ముందునుంచి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం వర్సెస్ రాజయ్య వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఎమ్మెల్యే కాకముందు నీ ఇంటి కిటికీలకు గోనె సంచులు ఉండే. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయి. నీతిమంతుడని మాట్లాడుతున్నావు. నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో నువ్వు అంతే. కడియం శ్రీహరి ఒక అవినీతి తిమింగలం అంటూ ధ్వజమెత్తారు రాజయ్య.మంత్రి పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఏం పనిచేశావో అన్ని నాకు తెలుసు. నా దగ్గర ఒక పుస్తకం ఉంది. అవసరం వచ్చినప్పుడు పుస్తకం బయటపెట్టి.. నీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో.. అన్నీ బయటపెడతా. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు స్టేషన్ఘన్పూర్నియోజకవర్గాన్ని కుదవపెట్టి సింగపూర్, మలేషియాలో ఆస్తులు సంపాదించావు అని కడియం శ్రీహరిపై రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. 2014, 2018 ఎన్నికల కోసం నా ఆస్తులన్నీ అమ్ముకున్నా. రాజకీయాల కోసం ఆస్తులు అమ్ముకున్న చరిత్ర నాదయితే.. ఆస్తులు కొనుకున్న చరిత్ర నీదని కడియం శ్రీహరిని తీవ్ర స్థాయిలో విమర్శించారు తాటికొండ రాజయ్య.
ఈరోజు నుంచి ఎన్నికలు జరిగే వరకు ప్రతిరోజు తిరుగుతాను. ప్రతి ఊరిలోనూ డప్పు కొడతాను. ఓటర్లకు పైసలు ఇచ్చి గెలిచే రోజులు పోయాయి. నియోజకవర్గంలో నాలా పరుగెత్తాలంటే నీ గుండె ఆగిపోతుంది. ప్రతిపక్షాల పప్పులు ఉడక్కుండా చేసిన మొండి కేసీఆర్ అయితే.. అంతకు మించిన జగమొండిని నేను. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ రోజు కూడా కొబ్బరికాయ కొట్టని నేతలు కూడా అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నారు. 20 ఏళ్లుగా నియోజకవర్గానికి, ప్రజలకు దూరమై.. వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాన్ని వ్యక్తిగతంగా వాడుకుంటున్నావు అంటూ కడియంపై రాజయ్య విరుచుకుపడ్డారు. కాగా, ఇద్దరు అధికార పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఇలా విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలోనేగాక, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది.తాజాగా కడియం శ్రీహరికి టికెట్ రావడంతో రాజయ్య ఆత్మరక్షణలో పడ్డారు. కడియంని ఓడించి తీరాలని సంకల్పంతో ముందుకెళ్ళాలని అందుకు అనుగుణంగా బలమయిన పార్టీలో చేరాలని భావిస్తున్నారు రాజయ్య. స్టేషన్ ఘన్ పూర్ రాజయ్య ప్రస్థానం ముందు ముందు ఎలా సాగుతుందో చూడాలి.