ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాలు అప్పుడప్పుడు తెరమీదకు వస్తుంటాయి. తాజాగా నాగార్జున సాగర్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రాజెక్ట్ 26 గేట్లలో చెరో 13 గేట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. ముళ్ళ కంచె, టెంట్లు వేసుకుని బందోబస్తు నిర్వహించారు. ఏపీ వైపు వాహనాలకు రాకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి. తాత్కాలిక విద్యుత్‌తో ఏపీ అధికారులు దౌర్జన్యంగా కుడి కాల్వకు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేటు ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ ఆయకట్టు రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే….ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు.పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై రేవంత్ స్పందిస్తూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు’ అని విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చే కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోంది. నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది.? తెర వెనుక ఎవరున్నారు?. కేసీఆర్‌వి ఫాల్స్ రాజకీయాలు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.