దేశమంతా రేపటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించే వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రేపు అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కు భారత్, ఆస్ట్రేలియా తరఫున పలువురు రాజకీయ నేతలు ముఖ్య అతిధులుగా హాజరుకాబోతున్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. తన రాష్ట్రంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారు.
అలాగే ఆస్ట్రేలియా తరఫున ఉప ప్రధాని కూడా హాజరయ్యే అవకాశాలున్నట్లు గుజరాత్ సీఎం ఇవాళ తెలిపారు.ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ వీక్షిస్తారని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా పలువురు ప్రముఖులు ఈ ఫైనల్ మ్యాచ్‌ని చూడటానికి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియానికి వస్తారని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం ట్వీట్ చేశారు.
టీమిండియా చాలా కష్టపడి ఫైనల్ కు చేరుకుందని, కాబట్టి వారిని ఫైనల్లో మరింత ఉత్సాహపరిచేందుకు స్వయంగా ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలని ప్రధాని మోడీ భావిస్తున్నట్లు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. టీమిండియా 12 సంవత్సరాల తర్వాత వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమిండియా ను ఉత్సాహపరిచేందుకు నరేంద్ర మోడీ స్టేడియంలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల బిజెపి ముఖ్యమంత్రుల రూపంలో ప్రభుత్వ పెద్దలంతా తరలివస్తున్నారు. 1983, 2011 తర్వాత భారత్‌కు మూడోసారి ప్రపంచకప్ గెలిచే అవకాశం ఉంది. ఈసారి కప్ మనదే అని అభిమానులు అంటున్నారు.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుసగా 10 మ్యాచ్ లలో గెలిచి ఫైనల్ కి చేరింది. ఈ ఫైనల్ పోరులో గెలిచి… మూడోసారి కప్ ను ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.